రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం

 
చత్తీస్ ఘడ్ లోని జగ్దల్ పూర్ నుండి ఓడిషా రాజధాని భూవనేశ్వర్ కు వెళ్తున్న హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లావద్ద పట్టలు తప్పిన దుర్ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియరాకున్నా కుట్రకోణాన్ని కొట్టివేయలేమని రైల్వే భద్రతా విభాగం అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాక్ ను ధ్వంసం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును చూసిన తరువాత ప్రమాదానికి కుట్రకోణం ఉండి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయని వారు చెప్పారు. ప్రాధమిక విచారణలో తాము ఒక నిర్ణయానికి రాలేమని అయితే కుట్రకోణాన్ని పూర్తిగా కొట్టివేయలేమని వారు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పాటుగా గణతంత్ర దినోత్సవానికి ముందు జరిగిన ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ రైల్వే భద్రతా విభాగం దర్యాప్తు చేస్తుందని వారు చెప్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన రెండు రైలు ప్రమాదాలకు కారణం ఉగ్రవాదుల చర్యలేనని బీహార్ పోలీసులు ఇటీవల ప్రకటించిన సంగతిని కూడా వారు గుర్తుచేస్తున్నారు. కాన్పూర్ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగానికి రైల్వే ట్రాకును ఉద్దేశ పూర్వకంగా ద్వంసం చేయడమే కారణమని బీహార్ పోలీసులు చెప్తున్నారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన సందర్భంగా వారు వెల్లడించిన విషయాలను బట్టి పోలీసులు కుట్రకోణాన్ని నిర్ణారించారు. ఈ క్రమంలో ఏపీలో జరిగిన ప్రమాదంలోనూ కుట్ర కోణాన్ని కొట్టివేయడానికి వీలు లేదని నిపుణులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *