దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప కు తమిళనాడులో క్రమంగా మద్దతు పెరుగుతోంది. అన్నాడీఎంకే లోనూ దీపను సమర్థిస్తున్నవారు పెరుగుతుండడం శశికళ వర్గానికి మింగుడుపడడం లేదు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శశికళ తమినాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అదిరోహించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. శశికళను బహిరంగంగా వ్యతిరేకించే ధైర్యం పార్టీలో ఎవరికీ లేని పరిస్థితుల్లో శశికళ వ్యతిరేకులకు దీప కొండంత ఆశగా కనిపిస్తున్నారు. దీనితో దీపను ప్రోత్సహిస్తూ తెరవెనుక పావులు కదుపుతున్నారు. శశికళను ప్రస్తుతం పార్టీలో పూర్తి పట్టు ఉంది అయితే శశికళను వ్యతిరేకిస్తున్నవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారంతా ఇప్పుడు దీపకు కావాల్సిన అండదండలు అందచేస్తున్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజేఆర్ శత జయంతి సందర్భంగా దీప మద్దతుదారులు చేసిన హడావుడి శశికళ వర్గానికి పెద్ద తలనొప్పిగా మారింది. తమిళనాడులో ప్రజల ఆమోదం తమకు పుష్కలంగా ఉందని నమ్ముతూ వచ్చిన చిన్నమ్మ సన్నిహితులకు దీపకు లభిస్తున్న మద్దతు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంజేఆర్ శత జయంతి సందర్భంగా దీప పేరిట పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. జయలలిత చిత్రపటం ఒక వైపు దీప చిత్రపటం మరో వైపు పెట్టి జయలలితకు నిజమైన వారసురాలు దీపనే అంటూ భారీ సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. దీనికి తోడు ప్లకార్డులతో దీప మద్దతుదారులు బలప్రదర్శనకు దిగారు. దీపకు మద్దతుగా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే మద్దతుదారులు బహిరంగంగా ప్లకార్డులు ప్రదర్శించడం శశికళకు గట్టి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.
శశికళను గట్టిగా వ్యతిరేకిస్తున్న దీప వద్దకు పెద్ద సంఖ్యలోనే ప్రజలు వస్తున్నారు. ఆమె నివాసం ఉండే పాండీ బజార్ కు నిత్యం వందల సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. చాలా మంది తెరవెనుక నుండి దీపకు మద్దతు పలుకుతున్నారు. వ్యక్తిగత పూజకు నిలయం అయిన తమిళనాడులో దీప పోలికలు, ఆహార్యం జయలలితకు దగ్గరగా ఉండడం ఆమెకు బాగా కలిసివస్తోంది. జయలలిత తరహాలో మాట్లాడేందుకు దీప చేస్తున్న ప్రయత్నాలు సత్పలితాలనే ఇస్తోంది. తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం నల్లేరుమీద బండి నడక అంటూ ఊహించుకుంటున్న శశికళకు దీప రూపంలో పెద్ద అవరోధం ఎదురవుతోంది.