మహోన్నత వ్య(శ)క్తి ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) ఈ పేరు తెలియని తెలుగు వారు ఖచ్చితంగా ఉండరు. అన్నగా ప్రజలంతా అభిమానంగా పిల్చుకునే ఈ మహోన్నత వ్యక్తి నిజంగా కారణజన్ముడు. ఆరాధ్యదైవంగా తెలుగు వారు ఆరాధించి మహా మనీషి నందమూరి తారకరామారావు. ఆయన్ను రాజకీయంగా వ్యతిరేకించేవారు ఉన్నా వారు సైతం ఎన్టీఆర్ విధానాలను తప్ప ఆయన్ను వ్యక్తిగతంగా ధ్వేషించే సాహయం చేయలేదు. సినీ రంగంలో మకుటం లేని మహారావుగా ఎన్టీఆర్ వెలుగొందారు. పౌరాణిక, జనపద,సాంఘీక చిత్రాల్లో ఏ పాత్ర వేసిన తనకుతానే సాటి అని నిరూపించుకున్న మహా నటుడు. కృష్ణుడు నిజంగా ఇట్లానే ఉండేవాడా అనేలాగా కృష్ణుడికి ప్రతిరూపంగా నిల్చాడు. అదే స్థాయిలో రావణుడిగా, దుర్యోదనుడిగా మెప్పించాడు. సాంఘీక చిత్రాల్లో ఆయన వేసిన పాత్రలు వేటికి అవేసాటి. చక్కటి రూపం దానికి తగ్గ అభినయం అంతకుమించిని వాక్కు ఒక నటుడికి ఇంతకన్నా ఏం కావాలి. తనకు తానుగా సినిమాల్లోనుండి బయటికి వచ్చే దాకా ఆయనే తెలుగులో నెంబర్ వన్ హీరో…
ntr
సినీరంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేశారు. తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఉద్దండులైన రాజకీయ వేత్తను సైతం మట్టికరిపించి రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సూపర్ హిట్ చేసి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయడంలోనూ, రాజకీయ విమర్శలు వచ్చినా తాను అనుకున్న పనిని సాధించుకోవడంలోనూ, నమ్మిన సిద్ధాంతాన్ని వదలకపోవడంలోనూ ఎన్టీఆర్ ముద్ర పాలనలో స్పష్టంగా కనిపించింది. పేదల పక్షపాతిగా పేరుపొందిన ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. నాటి ఆంధ్రప్రదేశ్ లో కేవలం కొన్ని వర్గాలకే పరిమితం అయిన రాజకీయాన్ని అందరికీ దగ్గర చేసిన వ్యక్తి ఎన్టీఆర్. పదవిని చేపట్టిన కొద్ది రోజులకే వెన్నుపోటుగురై పదవిని కోల్పోయినా వెంటనే తేరుకున్న ఆయన ఎదురులేకుండా రాష్ట్రాన్ని పాలించారు. సాధరణ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మరుసటి ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లోనూ చక్రంతిప్పారు. నేషనల్ ఫ్రంట్ పేరిట కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఒక్కతాటిపైకి తీసుకుని వచ్చిన ఎన్టీఆర్ చివరిరోజుల్లో మాత్రం సొంత మనుషుల చేతిలోనే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కారణాలు ఏవైనా ఎన్టీఆర్ మాత్రం చివర రోజుల్లో ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. తెలుగు ప్రజల గుండెల్లో నిల్చిపోయే మహోన్నత వ్యక్తి నందమూరి.

( ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *