ప్రపంచంలో సగం మంది పేదల వద్ద ఉన్న మొత్తం సంపద కంటే ఎక్కువ కేవలం ఎనిమిది మంది వ్యక్తుల వద్ద పోగుపడి ఉంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆక్స్ ఫామ్ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపద ఈ ఎనిమిది వద్ద ఉందని లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేదలు మరింత పేదలుగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయని ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 2016 కంటే ఆర్థిక అసమానతలు కొంచెం పెరిగాయి. గత సంవత్సరం 9 మంది ప్రపంచ కూబేరులు ప్రపంచంలోని దాదాపు సగం మంది సంపదతో సమానంగా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యో 8కి తగ్గింది. 2010లో అది 43గా ఉండేది. 2010లో 43 మంది వద్ద పోగుబడిన సంపదతో దాదాపు ప్రపంచంలోని సగం జనాభాకు సమానంగా ఉండేది. ఈ లెక్కల ప్రకారమే పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు ఎంతగా పెరిగిపోతున్నాయో తెలుస్తోందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ధనవంతుల ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తున్నా పేదల ఆదాయలు మాత్రం పెరగడం లేదు. ధనవంతులు ఏటా 11 శాతం దాకా తమ ఆదాయలను పెంచుకుంటూ పోతున్నారు. పేదల ఆదాయాల్లో మాత్రం ఎటువంటి పురోగతి కనిపించడంలేదు. ధనవంతులు తమ సంపదను షేర్ల రూపంలో ఉంచడం కూడా వారి సంపద పెరగాడనికి కారణంగా చెప్తున్నారు. భారీగా సంపద పోగు చేసుకుంటున్నా సంపన్నులు పన్నులు మాత్రం ఎగ్గొడుతున్నారట. తమ వద్ద పనిచేసే వారికన్నా తక్కువ పన్నులు కడుతున్న వైనాన్ని నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అర్థిక అసమానతలు భారీగా పెరిగిపోవడం వల్ల సమాజానికి కీడు జరుగుతుందని ఆ నివేదికలో ఆక్స్ ఫాం ఆందోళన వ్యక్తం చేసింది.