నయీం కేసులో కనిపించని పురోగతి

కరడుగట్టిన నేరగాడు నయీం కేసు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే లాగా కనిపించడం లేదు. రాజకీయ దుమారానికి కేంద్ర బిందువైన నయీం కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్నా విచారణలో వేగం తగ్గిందనే విమర్శలు వస్తున్నాయి. అసలు రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని వారిపై విచారణ సందర్భంగా తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నందున సీబీఐ తో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే విపక్షాల వాదనను ప్రభుత్వం పూర్తిగా కొట్టి వేస్తోంది. పోలీసులపై ఎటువంటి ఒత్తిడులు లేవని చెప్తోంది. నయీం ఎన్ కౌంటర్ తరువాత పెద్ద సంఖ్యలో నయీం బాధితులు వెలుగులోకి వచ్చినప్పటికీ ఆదే సంఖ్యలో ఇంకా పోలీసులను ఆశ్రయించని వారు కూడా ఉన్నారు. నయీం కేసులో రాజకీయ నేతల, పోలీసు అధికారులను ప్రశ్నించవచ్చని అవసరం అయితే వారిని అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ముగ్గురు పోలీసు అధికారులను, ఒక ఎమ్మెల్యేను విచారించిన పోలీసులు ఆ తరువాత ఎవరినీ విచారించలేదు.
నయీంతో అసలు పోలీసు అధికారులకు, రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని హోంశాఖ ఏకంగా కోర్టుకు చెప్పడంతో చాలా మంది ఈ కేసుపై పెదవివిరుస్తున్నారు. నయీంకు పోలీసు, రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలను బయటపెట్టాలంటూ సిపీఐ నేత నారాయణ హైకోర్టులో వేసిన కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు,రాజకీయ నేతలతో సంబంధాలపై తమ వద్ద రుజువులు లేవని చెప్పడం పెద్ద రాజకీయ దుమారాన్నే లేపింది. పోలీసులు, రాజకీయ నేతల అండ లేకుండానే నయీం ఇన్ని అరాచకాలు కొనసాగించాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసు, రాజకీయ నేతలతో నయీం కు ఉన్న సంబంధాలు బహరింగ రహస్యే పోలీసులు కూడా పలు సందర్భాల్లో ఈ లింకుల గురించి ఒప్పుకున్నారు. తీరా విచారణ సందర్భంగా ప్రభుత్వం ప్లేటు మార్చి పోలీసులను, రాజకీయ నేతలను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
నయీం కేసును నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు విషయంలో ఎటువంటి రాజీ లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా వాస్తవంలో ఆ విధంగా జరగడం లేదని వారు అంటున్నారు. మరో వైపు నయీంకు అత్యంత సన్నిహితుడు శేషన్న అచూకీ పోలీసులకు ఇంతవరకు లభించలేదు. శేషన్న ఆచూకీ లభిస్తే కేసులో చాలా చిక్కుముడులు వీడిపోయే అవకాశం ఉందంటున్నారు. నయీం కు అత్యంత సన్నిహిడుగా ఉన్న ఇతను నయీంకు రైట్ హ్యాండ్ గా వ్యవహరించాడు. నయీం ఎన్ కౌంటర్ తరువాత దాదాపు వంద మందిని పోలీసులు అరెస్టు చేసినా శేషన్న మాత్రం పోలీసులకు చిక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *