గంగానదిలో పడవ బోల్తా ఘటనతో బీహార్ రాజధాని పాట్నాలో విషాదం నెలకొంది. పడవ బోల్తాపడిన స్థలంలో మరో రెండు మృత దేహాలు పైకి తేలాయి దీనితో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 26కు చేరుకుంది. స్థానికంగా పతంగుల పండుగకోసం సబల్ పూర్ దయారాకు వెళ్లి తిరిగి పాట్నాలోని రాణీఘాట్ కు వస్తున్న క్రమంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా మరో 9మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని బీహార్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పతంగుల పండుగను చూడడానికి వెళ్లిన వారు విగత జీవులుగా మారడంతో రాణీ ఘాట్ పరిసర ప్రాంతాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. 40 మంది ప్రయాణికులతో వస్తున్న బోట్ ఒక్కసారిగా అదుపుతల్లి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. ప్రమాదానికి గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి కారణాలు అన్వేషిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. మరిణించిన వారికి తీవ్ర సానుభూతి తెలిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటాని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామని నితీష్ చెప్తున్నారు.