గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత్ సిద్దమవుతుండగా ఈ వేడుకలను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కాచుకుని కూర్చున్నారంటూ నిఘవర్గాలు హెచ్చరిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం జనవరి 26న దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘావర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ, ముంబాయితో పాటుగా భారత్ లోని ప్రధాన నగరాల్లో దాడులు జరపడానికి ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకని దేశవ్యాప్తంగా పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తుండడంతో ఉగ్రవాదులు కొత్త తరహాలో దాడులు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సారి పెంపుడు జంతువులను ఉపయోగించి దాడులకు దిగవచ్చని భావిస్తున్నారు. జంతువులకు పేలుడు పదార్థాలను అమర్చి వాటి సహాయంతో పోలుళ్లు జరపాలని ఉగ్రవాదులు భావిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. జంతువులను ఉపయోగించి విద్వంసానికి పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాదుల తరహాలోనే ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి. సిరియాలో కోళ్లు ఇతర పక్షులను ఉపయోగించి పేలుళ్లకు పాల్పడ్డారు.అదే తరహాలో ఇక్కడ కూడా పేలుళ్లకు తెగబడే అవకాశం ఉందని అందు వల్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు చూచిస్తున్నాయి.
నిఘా వర్గాల హెచ్చరిక నేపధ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా నిరంతరం నిఘాను మరింత పెంచుతున్నారు. అనుమానితులపై పహారా కొనసాగుతోంది. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.