ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన పి.వి.సింధు కు అందిన నజరానాలకు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ప్రీమియర్ బ్యాటింటన్ లీగ్ పోటీల సందర్భంగా భారత్ వచ్చిన ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ పి.వి. సింధు అందిన నజరానాలను చూసి గుడ్లు తేలేసింది. సింధూకు భారీగా అందిన నగదు పురస్కారాల్లో కనీసం 10 వంతు మాత్రమే తనకు దక్కిందని మారిన్ అంటోంది.దీన్ని చూసిన తరువాత భారత్ లో క్రీడలకు ఎంత ఆదరణ ఉంది అన్న విషయం తెలిసివచ్చిందని ఆమె అంటోంది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి సింధూకు భారీగా నగదు పురస్కారాలు అందిన సంగతి తెలిసిందే. ఆమెకు నగదు రూపంలో దాదాపు 13 కోట్ల రూపాయలు దక్కగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇంటి స్థలాలు ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకుంది. వీటితో పాటగా ఆమెకు వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి కార్లు, ఆభరాణాలు, ఇతర విలువైన వస్తువులు కానుకలుగా వచ్చాయి. పి.పి.సింధూకు వచ్చిన ప్రచారంతో వివిధ సంస్థలు ఆమెకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి విలువ 50 కోట్లకు పైమాటగానే మార్కెట్ వర్గాల అంచానా. ఇంత పెద్ద మొత్తంలో పురస్కారాలు సింధూకు రావడం పట్ల పాపం మారిన్ ఆశ్చర్య పడుతోంది. తనకు తమ ప్రభుత్వం కేవలం 70 లక్షల నగదు అందచేసిందని వెల్లడించింది.పి.వి.సింధు కు వచ్చిన ఆదరణ, నగదు పురస్కారాల్లో పదో వంతు కూడా తనకు లభించలేదని ఆమె చెప్తోంది. తన స్వస్థలం స్పెయిన్ లో క్రీడలకు ఆదరణ అంతగా లేదని కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా ఆదరణ ఉందని పేర్కొంది. క్రీడలకు భారత్ లో ఇంతటి ఆదరణ ఉందన్న సంగతి తనకు తెలియదని అంటోంది. మారిన్ బ్యాటిమింటన్ లీగ్ లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తోంది.