పెద్ద నోట్ల రద్దు తరువాత 50 రోజుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని నమ్మబలికిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మరో 50 రోజుల పాటు వేచిచూడాలంటున్నారు. 50 రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని చెప్పిన వారు ఇప్పుడు అసలు ఆ ప్రస్తవనే తీసుకుని రావడం లేదు. నగదు సమస్యలు తీరడానికి మరో 50రోజుల సమయం పడుతుందని చెప్తున్నా పరిస్థితిని చూస్తుంటే 50రోజుల్లో సమస్యలు తీరతాయనే ఆశ మాత్రం కనిపించడం లేదు. నగదు సమస్యకు విరుగుడుగా డిజిటల్ జపం చేస్తున్న సర్కారు నగదు రహిత లావాదేవీల్లో వస్తున్న సమస్యలను మాత్రం తీర్చే ప్రయత్నాలు చేయడం లేదు. నగదు రహిత లావాదేవీలకు గాను వినియోగదారుడి నెత్తిన పడుతున్న అదనపు భారం పై కూడా ప్రభుత్వపు పెద్దలు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పై సర్వీస్ ఛార్జీల విషయంలోనూ సమస్యలు వస్తున్నాయి. ఎటువంటి సర్వీస్ ఛార్జీలు విధిచడం లేదని తొలుత చెప్పినా ఇప్పుడు సర్వీస్ ఛార్జీల విషయంలో బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. ముక్కుపిండి మరీ సర్వీస్ ఛార్జీలను వసూలు చేసే పనిలో పడ్డాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు.
ఆర్థిక శాక నుండి సర్వీసు ఛార్జీల పై వస్తున్న ప్రకటనల్లో కొద్ది కాలానికి మినహాయింపులు అని చెప్తున్నారు తప్ప వాటిని పూర్తిగా ఎత్తివేసే క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వినియోగ దారుడి నెత్తిన సర్వీస్ ఛార్జీల బాదుడు ఉంటే నగదు రహిత లావాదేవేల వల్ల సాధారణ ప్రజలపై అదనపు భారం పడడం తప్పిస్తే ఎటువంటి లాభం కలిగే అవకాశాలు కనిపించడం లేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు చలామణిలో లేకుండా లేదా నగదు రూపంలో నల్లధనం కేవలం 6 శాతం మాత్రమే ఈ ఆరు శాతం నల్లధనం కోసం దాదాపుగా 86శాతం నోట్లను రద్దు చేయడం పట్ల మొదటి నుండి ఆర్థిక వేత్తలు విస్మయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అమర్త్యసేన్ లాంటి ఆర్థిక వేత్తలు కూడా ఈ చర్యను తప్పుబడుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దుతో అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్తోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల పెద్ద సంఖ్యలో నల్ల ధనం బయటికి వచ్చిందా అంటే అదీ లేనట్టుగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం నగదు కోసం నానా తిప్పలు పడుతున్న ప్రజలు ఈ సమస్యలు ఇంకా ఎన్నాళ్లని ప్రశ్నిస్తున్నారు. నగదులేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మాత్రం ఇప్పట్లో తీరేలాగా కనిపించడంలేదు.