పన్నులు ఎగ్గొట్టే వారి చిట్టా సిద్ధం

ఇబ్బడిముబ్బడిగా ఆదాయం ఉన్నా పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారి చిట్టాను ఆదాయపు పన్ను శాఖ సిద్ధం చేసుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తగా బ్యాంకు ఖాతాలను నిశితంగా పరిశీలించిన తరువాత అనుమానాస్పదంగా ఉన్న ఖాతాలకు నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు ఆదాయపు పన్ను శాఖాధికారులు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి 50 రోజుల గడువిచ్చింది కేంద్ర ప్రభుత్వం దీనితో పెద్ద మొత్తంలో వివిధ ఖాతాల్లోకి డబ్బులు వచ్చిచేరాయి. గతంలో ఎటువంటి లావాదేవీలు నిర్వహించకుండా ఒక్కసారిగా డబ్బులు వచ్చి చేరిన ఖాతాలను గుర్తించిన  కేంద్ర వర్గాలు అంత పెద్ద మొత్తంలో ఆ ఖాతాల్లోకి డబ్బు ఎట్లా వచ్చి చేరిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. రెండు లక్షలు ఆపైన జమ అయిన  ఇటువంటి ఖాతాలు దాదాపు 60 లక్షల వరకు ఉండవచ్చని అంచానా.
మరికొన్ని ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమ అయిందని ఆ ఖాతాలకు సంబంధించి గతంలో పెద్దగా లావాదేవీలు జరగలేదని ఆదాయపు పన్ను కట్టిన దాఖలాలు కూడా లేవని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటువంటి ఖాతాలపై కూడా ఐటి అధికారులు గురిపెట్టారు. క్రియాశీలంగా లేకుండా ఉండి ఒక్కసారిగా డబ్బు వచ్చిన చేరిన ఖాతాలను అధికారులు గుర్తించారు. వీటిలో దాదాపుగా 25వేల కోట్ల రూపాయలు జమఅయినట్టు అధికారులు లెక్కలు తీశారు. వీటితో పాటుగా పెద్ద మొత్తంలో రుణాలను తిరిగి చెల్లించారు. వీటి విలువ 80వేల కోట్ల రూపాయలు కాగా గ్రామీణ ప్రాంతాల్లో, సహకరా బ్యాంకుల్లోనూ పెద్ద మొత్తంలో నగదు జమ అయింది. ఇందులో నిజమైన లావాదేవీలు ఎన్ని లెక్క చూపని నగదు జమ అయిన ఖాతాలు ఎన్ని అనేదానిపై ఐటి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా బ్యాంకుల్లో 4లక్షల కోట్ల రూపాయల నల్లధనం వచ్చి చేరిఉంటుందని అనుమానిస్తున్నారు.
పెద్ద మొత్తంలో ఆదాయపు పన్నును ఎగ్గొట్టిన వారికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డ ఐటి శాఖ భారీ మొత్తంలో జరిమానాలు విధించేందుకు సిద్ధపడుతున్నారు. నిజాయితీగా పన్నులు కట్టేవారికి ఎటువంటి ఇబ్బందులు రావని అటువంటి వారి ఖాతాల జోలికి రాబోమని ఐటి అధికారులు స్పష్టం చేశారు. డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అనే దానిపై సంతృప్తికర వివరణ ఇస్తే సరిపోతుందని నోటీసులు వచ్చినంత మాత్రానా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఐతే పన్నులు ఎగ్గొట్టి నల్ల ధనాన్ని మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్న వారిని మాత్రం వదిలేదని లేదని ఐటి శాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *