హింధు దేవుళ్లను కించపర్చేవిధంగా సన్నివేశాలు ఉన్న “ద్యావుడా” సినిమా ట్రైలర్లను వెంటనే యూట్యూబ్ నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రాహ్మణ సంఘాలు తెలంగాణ డీజీపీని కోరారు. ఈ మేరకు సంఘ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మను కలిసిన ప్రతినిధి బృందం సభ్యులు యూట్యూబ్ లో ఉన్న టీజర్ ను చూపించారు. హింధువుల మనోభావాలు దెబ్బతినేవిగా ఉన్న ఈ టీజర్ ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని బృంద సభ్యులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన అనురాగ్ శర్మ వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీజీపీని కలిసిన తరువాత బ్రాహ్మణ బృందం సభ్యులు మీడియాతో మాట్లాడారు. ద్యావుడా పేరుతో ఉన్న సినిమాలోని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయని, శివునిపై బీరుతో అభిషేకం చేయడం, వేంకటేశ్వరస్వామి పటాన్ని అవమానించడం లాంటి సన్నివేశాలు ఉంచడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.