ఆస్కార్ అవార్డును సాధించడం కన్నా భారతీయ సినీ ప్రేక్షకులకు దగ్గర కావడమే తనకు ప్రధానమని ప్రముఖ సినీ నటుడు ఆమీర్ ఖాన్ అన్నాడు. ఆయన ఇటీవల నటించిన “దంగల్” సినిమా ఆస్కార్ రేసులో ఉందా అన్న ప్రశ్నకు ఆమీర్ ఖాన్ స్పందిస్తూ తనకు ఆస్కార్ అవార్డు కన్నా భారతీయ ప్రేక్షకుల ఫ్రశంసలే ముఖ్యమని చెప్పారు. తాను నటించిన చిత్రం విజయవంతం అయితే ఆస్కార్ అవార్డులు లభించిన దానికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. “దంగల్” సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంచి సినిమాలను మన ప్రేక్షుకులు ఎప్పుడైనా ఆదరిస్తారని ఆ నమ్మకంతోనే తాను ఈ చిత్రంపై మొదటి నుండి నమ్మకం పెట్టుకున్నానని చెప్పారు. “దంగల్” సినిమా విజయవంతం కావడంలో ప్రతీ ఒక్కరి పాత్రా ఉందన్నారు. ఈ చిత్ర విజయం కేవలం తన ఒక్కడి ఘనకార్యంగా భావించడం లేదని ఆమీర్ ఖాన్ చెప్పారు. “దంగల్” చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తుండడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే సినిమా వసూళ్లపై తనకు నమ్మకం లేదని చెప్పారు. చిత్రం ప్రజలకు చేరువ కావాలన్నదే తన ప్రధాన లక్ష్యం అని అది నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు. మరో వైపు “దంగల్” భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే “దంగల్” 320 కోట్లను వసూలు చేయగా ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న పీకే (341కోట్లు) ను సులభంగా అధిగమిస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. “దంగల్” సినిమా భారత్ తో పాటుగా విదేశాల్లోనూ భారీగా వసూళ్లను సాధించింది.