ఉద్యోగం పోయి…అప్పులు మిగిలి..

గల్ఫ్ లో తెలంగాణ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గల్ఫ్ దేశాల్లో క్రూడ్ ఆయిల ధరలు గణనీయంగా పడిపోవడంతో అక్కడి ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. దీనితో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులను బలవంతంగా పనుల్లోనుండి తొలగిస్తున్నాయి. సొంత ఊరిలో అప్పులు చేసి గంపెడు ఆశలతో గల్ఫ్ దేశాలకు చేరుకుంటున్న కార్మికులను పనిలోనుండి తొలగించడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఒక్క సారిగా ఉద్యోగం పోవడంతో దేశంకాని దేశంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు పోవడం ఆదాయం లేకపోవడంతో రోజువారీ ఖర్చును భరించలేకపోతున్నారు. మళ్లీ ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అప్పులతో కాలం వెళ్లదీస్తున్న వారు కొందరైతే స్వదేశానికి తిరిగి వస్తున్నవారు మరికొందరు.
అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడ ఉద్యోగం పోవడంతో అప్పులే మిగిలాయని వాటిని ఎట్లా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు.  గల్ఫ్ లో దాదాపు పదిలక్షలకు పైగా తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. గల్ఫ్ లో భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా నిర్మాణ, ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో గల్ఫ్ దేశాల్లో ఆర్థిక సమస్యలు తీవ్రం  అయ్యాయి. ఆ ప్రాభవం ప్రధానంగా నిర్మార రంగం మీద పడింది. దీనితో ఈ రంగంలో ఉన్న వారు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా మిగిన వారిలో అందరి పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగాన్ని నమ్ముకుని దినదిన గండంగా బతుకులు వెల్లదీస్తున్నారు. కొన్ని చోట్ల జీతాలు కూడా తగ్గిస్తున్నారు. గతంలో స్థానికులు ఉద్యోగాలు చేసే వారు కాదు. కానీ మారిన పరిస్థితుల నేపధ్యంలో పెద్ద సంఖ్యలో స్థానికులు ఉద్యోగాల వేటలో పడ్డారు. దీనితో విదేశీయులను తొలగించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీని వల్ల కూడా గల్ఫ్ లో ఉద్యోగాలు కోల్పేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
గల్ఫ్ ఉద్యోగం అంటే ఎగిరి గంతేయవద్దని అన్ని సక్రంగా ఉంటేనే ఇక్కడికి రావాలని గల్ఫ్ లో ఉన్నవారు సూచిస్తున్నారు. దీనితో పాటుగా తెలంగాణ ప్రభుత్వం విదేశాలకు వెళ్లేవారికోసం కల్పిస్తున్న సౌకర్యాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *