సినీ నటుడు బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ప్రీమియర్ షో కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ప్రిమియర్ షోకు తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. చారిత్రాత నేపధ్యం ఉన్న ఈ చిత్రానికి వినోదపు పన్నును మినహాయించాలంటూ బాలకృష్ణ చేసిన విజ్ఞప్తిని కూడా కేసీఅర్ అంగీకరించారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి ఇచ్చినట్టుగానే చారిత్రాత్మక చిత్రాలకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నట్టు సీఎం వెల్లడించారు. గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాన్ని నిర్మించడానికి తాము పడ్డ శ్రమను బాలకృష్ణ సీఎంకు వివరించారు. పూర్తిగా చారిత్రక ఆధారాలు లేకున్నా సినిమా యూనిట్ అత్యంత వ్యయప్రయాసలతో ఈ చిత్రానికి సంబంధించిన చరిత్రను క్రోడీకరించినట్టు చెప్పారు. గౌతమీ పుత్ర శాతకర్ణీ ఒక మంచి చిత్రం గా రూపుదిద్దుకుందని బాలయ్య వివరించారు.