బీఎస్ఇలో ఐటి షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఐటి రంగ షేర్లలో భారీ పతనం నమోదయింది. దాదాపు 2.5 శాతం మేర ఐటి షేర్లు పడిపోయాయి. దీనితో పాటుగా ఇతర రంగాలకు చెందిన షేర్లు కూడా పతనం కావడంతో దాదాపు 2వేల కోట్ల రూపాయల మేర ఐటి కంపెనీలు నష్టపోయాయి. హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.5శాతం, ఇన్ఫోసిస్ 2.5శాతం, టీసీఎస్ 2శాతం, విప్రో 2శాతంమేర దిగజారాయి. నష్టాలు చవిచూసిన ఈ కంపెనీల మార్కెట్ విలువ మొత్తం రూ.22వేల కోట్లు గా అంచానా. హెచ్1-బి వీసా ప్రోగ్రామ్లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా కాంగ్రెస్లో మళ్లీ ప్రవేశపెట్టడం ఈ భారీ పతనానికి కారణంగా చెప్తున్నారు. హెచ్1-బి వీసా దుర్వినియోగానికి తాజా బిల్లు అడ్డుకట్ట వేస్తుందంటూ రిపబ్లికన్ నేతలు డారెల్ ఇసా, స్కాట్ పీటర్స్ ఈ బిల్లును కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. తక్కువ వేతనాలకే విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం ద్వారా అమెరికన్లకు ఉపాధిని దూరం చేస్తున్న సంస్థలపై చర్యలకు దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. హెచ్1-బి వీసాకు కనీస వేతనాన్ని రూ.67లక్షలకు(ఏడాదికి) పెంచడం, మాస్టర్స్ డిగ్రీ విషయంలో ఇస్తున్న మినహాయింపులను తొలగించడం వంటి మార్పులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనితో ఐటి షేర్లు కుదేలయ్యాయి. ఈ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించిన పక్షంలో ఐటి పరిశ్రమ భారీ కుదుపులకు నోనయ్యే అవకాశం ఉందని భయాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్కసారిగా ఐటి కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.