కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని గత సంవత్సరం 2.55కోట్ల మంది దర్శించుకోగా వేయి కోట్ల రూపాయలకు పైగా హుండి ఆదాయం వచ్చింది. 2016 వ సంవత్సరం లో రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలకు వచ్చారు. వడ్డీకాసుల వాడి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 1018 కోట్ల రూపాయలు స్వామివారి హుండీలో భక్తులు సమర్పించుకున్నారు.
మరో వైపు తిరుమల దేవదేవుని హుండీలో రద్దయిన నోట్లు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నాయి. పాత నోట్లను మార్చుకునే గడువు పూర్తయిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో వేంకటేశ్వర స్వామి హుండీకి పాత నోట్లు వచ్చి చేరుతున్నాయి. రోజుకు దాదాపు 30 నుండి 35 లక్షల రూపాయల దాకా పాత నోట్లు వచ్చి చేరుతున్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు. డిసెంబర్ 30 వరకు పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయించుకున్న బ్యాంకులు ఆ తరువాత డిపాజిట్ చేయడానికి ఆంగీకరించడం లేదు. దీనిపై టిటిడి అధికారులు రిజర్వ్ బ్యాంకు కు లేఖ రాసినా ఇంకా సమాధానం రాలేదని తెలుస్తోంది.