హైదరాబాద్ కు అంధ్రా పందెం కోళ్లు

కోళ్ల పందాలపై నిషేధాన్ని విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన నేపధ్యంలో కోళ్ల పందాలు ఎక్కువగా జరిగే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో పందెపు కోళ్లను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కోళ్ల పందాల కోసం ఉభయగోదావరికి పెద్ద సంఖ్యలో నగరానికి చెందిన వారు వెళ్తూ ఉంటారు. ఇక్కడి నుండి వెళ్లి పెద్ద సంఖ్యలో పందాలు కాస్తుంటారు. తమ ప్రాంతంలో పోలీసుల కట్టడి ఎక్కువ కావడంతో కోళ్ల పందాలకు మంచి డిమాండ్ ఉన్న హైదరాబాద్ కు కోళ్లను దొంగచాటుగా తరలిస్తున్నారు. నగర శివార్లలోని ఫాం హౌస్ లకు కోళ్లను చేరవేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో పందెపు కోళ్లు ఫాం హౌస్ లకు చేరుకున్నట్టు సమచారం. సంక్రాంతి మూడు రోజులు పరిస్థితిని బట్టి ఆంధ్రాకు వెళ్లాలని లేకుంటే హైదరాబాద్ లోనే పందాలను నిర్వహించేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ముందుగానే పందెపు రాయుళ్లతో సంప్రదింపులు జరిపి ఏయే ప్రాంతాల్లో పందాలను నిర్వహించేది వారికి చెప్తున్నారు.
ఆంధ్రా నుండి పందెపు కోళ్లు నగరానికి చేరుకున్న సంగతి తెలిసిన పోలీసులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడా పందాలు జరిగినట్లు సమాచారం లేదని పోలీసులు చెప్తున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోళ్లను పెంచుకోవడంలో ఎటువంటి నేషేధం లేదని అయితే వాటిని పందాలకు ఉపయోగిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆంద్రా ప్రాంతనుండి వచ్చిన పందెపు కోళ్లపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు వాటితో పందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *