అందాలతార దీపిక పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలతో ముంచెత్తున్నారు. దీపిక సినీరంగానికి తెరంగేట్రం చేసింది ‘ఐశ్వర్య’ అనే కన్నడ సినిమాతో. ఆ తర్వాత ప్రముఖ గాయకుడు హిమేష్ రేషమ్మియా పాడిన ‘నామ్ హై తేరా తేరా’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో దీపిక నటించింది. ఈ ఆల్బమ్చూసిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ దీపికను షారుక్‌కి జంటగా ‘ఓం శాంతి ఓం’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. లవ్ ఆజ్ కల్, లఫంగే పరిందే, బచ్నా యే హసీనో, హౌస్‌ఫుల్, కాక్టెయిల్, యేజవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటించింది. మరో విషయమేంటంటే.. దీపిక ఇప్పటివరకు నటించిన సినిమాల్లో సగానికి సగం రూ.100 కోట్ల క్లబ్లో చేరినవే. 2015 దీపికకు ఎన్నో జ్ఞాపకాలను, విజయాలను ఇచ్చింది. బాజీరావ్ మస్తానీ, పీకూ సినిమాలతో దీపిక పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
దీపిక పుట్టింది డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో. ఆమె తండ్రి ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె. దీపికకి 11 నెలల వయసున్నప్పుడు కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తండ్రి లాగే దీపిక కూడా అథ్లెట్. జాతీయస్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లోనూ పాల్గొంది. దీపిక బాడ్మింటనే కాదు రాష్ట్రస్థాయి బేస్‌బాల్ క్రీడాకారిణి కూడా. కానీ మోడలింగ్‌పై ఆసక్తితో క్రీడలకు స్వస్తి చెప్పింది. అలా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దీపిక చాలా ప్రకటనల్లో నటించింది.
దీపిక ‘ట్రిపులెక్స్: ది రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. జనవరి 19న ఈ చిత్రం తొలుత మన భారతదేశంలో విడుదల కాబోతుండడం విశేషం.