మధ్యం మత్తు తలకెక్కి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకల రేపింది. పట్టపగలు విద్యార్థిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గంటపల్లి నుండి మాజీదా పూర్ లోని స్కూల్ కు వెళ్ళి తిరిగి వస్తున్న బాలికను అటకాయించిన ఇద్దరు యువకులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకునే యత్నం చేశారు. దీనితో బాలిక గట్టిగా కేకలు వేయడంతో గట్టుపల్లికి చెందిన వ్యక్తి కిడ్నాప్ యత్నాన్ని అడ్డుకుని అందుకు ప్రయత్నించిన వ్యక్తులను వెంబడించి పట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు కిడ్నాప్ కు ప్రయత్నించిన వారిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
పోలీసులకు పట్టుబడిన వ్యక్తుల్లో ఒకరు రామోజీ ఫిలిం సిటీలో ఉద్యోగి కాగా మరొకరు ప్రైవేటు డ్రైవర్. బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సమంయలో ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో తమ గ్రామ వాసి అక్కడ ఉండడంతో గండం తప్పిందని బాలిక బంధువులు అంటున్నారు. స్కూల్ వెళ్లి వస్తున్న సమయంలోనూ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠనంగా శిక్షించాలని కోరుతున్నారు.