స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ ఖాతాల నుండి ఈ వ్యాలెట్ లకు నగదు బదలాయింపును ఎస్ బీఐ నిలిపివేసింది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా మాత్రమే ఈ వ్యాలెట్ లో నగదును బదలాయించుకునే సౌకర్యం ఉంటుంది. ఆన్ లైన్ ఖాతాలో ఈ సేవలు అందుబాటులో ఉండవు. దీనిపై స్టేట్ బ్యాంక్ నుండి రిజర్వ్ బ్యాంక్ వివరణ కోరింది. అయితే సైబర్ దాడులు పెరిగిపోయిన నేపధ్యంలో భద్రతా చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు ఎస్ బిఐ వివరణ ఇచ్చింది. ఈ నిషేధం తాత్కాలికమేనని త్వరలో తిరిగి ఆన్ లైన్ బ్యాంకింగ్ నుండి ఈ వ్యాలెట్ కు నగదు బదిలీ సౌకర్యాన్ని పునరుద్దరిస్తామని పేర్కొంది. అయితే ఎస్ బీఐ చెప్తున్న భద్రతా కారణాలను ఇతర ఈ వ్యాలెట్ సంస్థలు కొట్టి పారేస్తున్నాయి. ఎస్ బీఐకి చెందిన సొంత ఈ వ్యాలెట్ యాస్ బడ్డీని మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం కోసమే ఎస్ బీఐ ఇటువంటి చర్యలకు దిగుతోందని ఈవ్యాలెట్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. తన సొంత యాప్ ను ప్రమోట్ చేసుకోవడం కోసం ఇటువంటి చర్యలకు దిగడం సమంజసం కాదని ఇతర యాప్ సంస్థలు అంటున్నాయి.