పద్మాదేవేందర్ కు సారీ చెప్పిన కోమటిరెడ్డి

అసెంబ్లీలో     ఫీజ్ రీయంబర్స్ మెంట్ చర్చ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. కోమటి రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా అధ్యక్ష స్థానంలో కూర్చున్న పద్మాదేవేందర్ రెడ్డి బెల్ కొట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి పదే పదే బెల్ కొడితే తాను మాట్లాడేది లేదని విసురుగా అన్నారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సభ్యుడి ప్రవర్తనను తప్పు పట్టారు. అధ్యక్ష స్థానాన్ని దిక్కరించే విధంగా కోమటిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తిపై అదీ మహిళపై కోమటిరెడ్డి దురుసుగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. దీనికి స్పందించిన కోమటిరెడ్డి అత్యంత కీలకమైన అంశంపై మాట్లాడుతున్న సమయంలో పదే పదే బెల్ కొట్టడంతో అసహనం వ్యక్తం చేశానని దీనికి డిప్యూటీ స్పీకర్ మనస్థాపానికి గురై ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. అదే సమయంలో మహిళలను గురించి మాట్లాడిన మంత్రి హరీష్ రావు తమ ముఖ్యమంత్రికి చెప్పి ఒక్క మహిళకైనా మంత్రివర్గంలో చేటు కల్పించాలని అన్నారు.