ఆ రొయ్యలు ఇప్పుడేవి:సీఎం కేసీఆర్

తెలంగాణ వ్యాప్తంగా గతంలో కనిపించే పొట్టు రొయ్యలు ఇప్పుడు కనుమరుగు అయ్యాయని చెరువుల్లో నీళ్లు నిండితే ఆ రొయ్యలు తిరిగి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మత్స్యకారుల సమస్యలు, చేపల పెంపకంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. పొట్టు రొయ్యలుగా పిల్చే ఎర్ర రొయ్యలు చాలా రిచికరంగా ఉంటాయని తన చిన్నతనంలో వాటిని బాగా తినేవాళ్లమని చెప్పారు. చింత చిరుగు వేసి రొయ్యలు వండితే వాటి రుచే వేరని సీఎం అనేసరికి సభలో నవ్వులు విరిశాయి. గతంలో అన్ని చెరువుల్లో లభించిన ఈ రకం రొయ్యలు క్రమంగా కనుమరుగు అయ్యాయని చెప్పారు. చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో ఇవి అంతరించిపోయాయన్నారు. తెలంగాణ ప్రాంతానికి జల కళ తీసుకుని వచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు.
 
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణలోని చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కేసీఆర్ అన్నారు. కాకతీయల నాటి గొలుసు కట్టు చెరువులు పూర్తిగా అంతరించి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. చెరువులు లేకపోవడంతో వాటిపై ఆధారపడి జీవించే రైతులతో పాటుగా చేపలు పట్టే వారు కూడా ఉపాధికోసం అల్లాడే పరిస్థితి వచ్చిందన్నారు.  చెరువుల నీళ్లు, చేపలతో కళకళలాడితే గ్రామాలు అన్ని రకాలుగా బాగుంటాయని అన్నారు. చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడతామని సీఎం వెల్లడించారు. చేపల పెంపకం భారీ ఎత్తున చేపట్టడం వల్ల కనీసం ఐదు వేల కోట్ల రూపాయల పరిశ్రమగా దీన్ని రూపొందించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సీఎం చెప్పారు. చేపల పెంపకంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితుల్లో మార్పులు తీసుకుని వచ్చే ప్రయత్నాలను తమ ప్రభుత్వం తీసుకుని వస్తోందన్నారు. చేపలను పట్టడంలో మన మత్స్యకారులకు ఎవరి శిక్షణా అవసరం లేదని అది వారి రక్తంలోనే ఉందన్నారు. కుల వృత్తులను నిర్లక్ష్యం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువైందని ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులకు పూర్త వైభవం వస్తోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *