దంగల్ లో చిత్తయిన ములాయం

కాలం కలిసివస్తే 2019లో ప్రధాన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు కొడుకు చేతిలో చావు దెబ్బతిని ములన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాను ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలనే ఆశతో కొడుక్కి ఉత్తర్ ప్రదేశ్ పగ్గాలు అప్పగించిన సమాజ్ వాదీ పార్టీ నేత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలనుకున్నాడు. బీసీ కార్డును ఉపయోగించి ఏకంగా ప్రధాని మంత్రి కుర్చీలో కూర్చోవాలకున్న ఈయన గారికి పాపం ఉన్న కుర్చీ కూడా పోయింది.సమాజ్ వాదీ పార్టీలో పూర్తిగా పట్టును కోల్పోయి కొడుకు చేతిలో ఉద్వాసనకు గురైన ములాయం ఆఖరి అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. పార్టీ అధ్యక్షుడిగా తానే అయినందున తన  అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం చెల్లదని హుంకరిస్తున్నాడు. సమాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్ ను తనకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. కింద పడ్డా పై చేయి నాదేనని అంటున్న ములాయం సింగ్ యాదవ్ కు పార్టీ మీద పట్టు లేదని తేలిపోయింది. పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపు 90 శాతం మంది కుమారుడి పక్షాన్నే ఉన్న సంగతి అఖిలేష్ బల ప్రదర్శనలో తేలిపోయింది. తనతో పాటు సంవత్సరాలుగా ఉన్న నేతలు చాలా మంది వైరి పక్ష శిభిరంలో చేరిపోవడంతో ఈ మాజీ మల్లయోధుడి పరిస్థితి కుడితిలోపడ్డ ఎలుకలాగా తయారయింది.
సమాజ్ వాదీ పార్టీ కుల, కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు మాలయం కుటుంబంలో ఒక ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రితో పాటుగా ఆరుగురు ఎంపీలున్నారు. పూర్తిగా కుటుంబ రాజకీయాలకు నెలవైన పార్టీలో ఎవరి మాట చెల్లాలనే దానిపై మొదలైన యుద్ధంలో పాపం ములాయం చివరికి కొడుకు చేతిలో కోలుకోలేని దెబ్బతిన్నాడు. నేతాజీ గా అందరూ పిల్చుకునే ఈ నాయకుడి నేతాగిరిగే ఎసరు వచ్చింది. గంటకో మలుపు తిరిగుతున్న ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయి. జాతీయ స్థాయి నేతగా తనను తాను ఊహించుకుని భారీ కలలు కన్న ములాయం కు ఇంటి నుంచే ముప్పు ఉందన్న సంగతి గమనించినట్టు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *