ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికోసం గాను రానున్న బడ్జెట్ లో నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. వైద్య, ఆరోగ్య రంగానికి నిధుల కొరతను తీర్చడానికి ముఖ్యమంత్రి సమాయత్తం అవుతున్నారు. ప్రజలకు వైద్యం భారంగా మారుతున్న తరుణంలో ప్రజా వైద్యశాలలు విస్తరించాంల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనికోసం గాను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. సర్కారు ఆసుపత్రులకు వచ్చే రోజుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని దానికి అనుగుణంగా సౌకర్యాలు కూడా మెరుగవ్వాలని సీఎం అన్నారు. ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ ల పేరిట బస్తీల్లో వైద్య సేవలు అందచేస్తున్నారని ఇదే తరహాలో హైదరాబాద్, వరగంల్ తో పాటుగా ఇతర పట్టణాల్లో క్లీనిక్ ల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఇదే సౌకర్యం అందుబాటులోకి వస్తే బస్తీల్లో ప్రజా వైద్యశాలలు ఏర్పాటు కానున్నాయి. ఢిల్లీతో పాటుగా ప్రభుత్వ వైద్య శాలలు మెరుగ్గా పనిచేస్తున్న తమిళనాడులోనూ అధికార బృందం పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యాయనం చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో శిశుమరణాల పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. శిశు మరణాలు అనేవే లేకుండా చేయాలన్నారు. దీనికోసం గాను ప్రతీ గర్భిణీ ఆసుపత్రిలోనే ప్రసవించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాల వల్ల పేదలపై మోయలేని భారం పడుతోందని దీనితో పాటుగా అవసరం లేకున్నా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ఇట్లాంటివి అరికట్టడానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గర్భిణీలకు పోషక ఆహారం అందేలా చూడాలన్నారు. పుట్టిన పిల్లలకు మూడు నెలలు వచ్చే వరకు అసరమైన సామాగ్రిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.