కొత్త సంవత్సరం వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారత్ లో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందంటూ ఇజ్రాయిల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులు విరుచుకుని పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ ఇజ్రాయిల్ తన దేశ పర్యాటకులను హెచ్చరించింది. విదేశీయులు ఎక్కువగా పాల్గొనే నూతన సంవత్సర ఉత్సవాల్లో ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందని ఇజ్రాయిల్ పేర్కొంది. ముఖ్యంగా గోవా,ముంబాయి,పుణే,కొచ్చి లాంటి ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయిల్ వ్యతిరేక సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలకు, బీచ్ లలో జరిగే పార్టీలకు వెళ్లకపోవడమే ఉత్తమమని ఇజ్రాయిల్ తమ దేశ పౌరులకు సూచించింది. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం సేకరించడంలో ఇజ్రాయిల్ ముందుంటుంది. ఇజ్రాయిలీ ఇంటలిజెన్స్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఈ నేపధ్యంలో ఉగ్రదాడులపై వచ్చిన హెచ్చరికలను భారత్ సీరియస్ గా తీసుకుంది. ఇక్కడా ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్తునే ప్రజలు అనుమానాస్పద వ్యక్తుల, వస్తువులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.