అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ పై అంతర్జాతీయంగా ఉగ్రవాద ముద్రను వేయకుండా చైనా అడ్డుపడింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ ముందు అజహర్ పై నిషేదానికి సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. మొత్తం ఈ కమిటిలో 15 దేశాలు సభ్యులుగా ఉండగా చైనా మినహా ఇతర దేశాలన్నీ భారత్ ప్రతిపాదనలకు మద్దతు పలికాయి. కానీ వీటో అధికారం ఉన్న చైనా ఈ ప్రతిపాదనను అడ్డుకోవడంతో తిరిగి మరోసారి ఆంక్షాల కమిటిలో భారత్ మరోసారి తన ప్రతిపాదనను పెట్టాల్సి ఉంటుంది. భారత్ లో మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ భారత్ లో అనేక ఉగ్రదాడులకు కేంద్ర బిందువు అయిన అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ గతంలోనూ చేసిన ప్రయత్నాలను చైనా అడ్డుకుంది.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రను వేయించాలనే భారత్ ప్రయత్నాలను అడుగడుగునా చైనా అడ్డుకుంటునే ఉంది. పాకిస్థాన్ కు వత్తాసుగానే చైనా ఈ చర్యలకు పాల్పడుతోందనేది బహిరంగ రహస్యమే. పాకిస్థాన్ తో అంటకాగుతున్న చైనా భారత్ కు వ్యతిరేకంగా ఈ చర్యలకు దిగుతోంది. తనకున్న వీటో అధికారంతో భారత్ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. అజహర్ పాకిస్థాన్ లో బహిరంగంగానే సంచరిస్తున్నాడు. పాక్ ప్రభుత్వం ఈ ఉగ్రవాదికి అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తోంది. ఒక సారి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడితే పాకిస్థాన్ బహిరంగంగా అజహార్ కు మద్దతు పలికే అవకాశం ఉండదు. దీనితో భారత్ ప్రయత్నాలను పాకిస్థాన్ చైనాను అడ్డంపెట్టుకుని అడ్డుకుంటోంది.
చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఉగ్రవాదంపై పోరులో చైనా ద్వంద్వ ప్రమాణాలకు ఇదే పెద్ద ఉదాహరణగా భారత్ పేర్కొంది. చైనా ఎన్నిసార్లు అడ్డం పట్టా అజహర్ లాంటి ఉగ్రవాదిపై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించే తమ ప్రయత్నాలను మానుకునేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అజహర్ పై చైనాకు అంత ప్రేమ ఎందుకో అర్థం కావడంలేదని వ్యాక్యానించింది. మరో వైపు చైనా భారత్ కు సుద్దులు చెప్తోంది. అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాద ముద్రకు సంబంధించి భారత్ భద్రతా మండలి తిర్మానాలకు కట్టుబడి ఉండాలంటూ నీతులు చెప్తోంది.