11 మృతదేహాలు వెలికితీక-బిల్డర్ అరెస్ట్

నానక్ రాం గూడలో ఎడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో సహాయక కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఇద్దరిని సహాయక బృందాలు కాపాడగలిగాయి. నిర్మాణ లోపం కారణంగానే ఈ భవనం కూలిపోయిందని నిర్థారించారు. బిల్డర్ సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తి సరైన భద్రతా చర్యలు తీసుకోకుండానే భవనాన్ని నిర్మిస్తున్నందువల్లే కూలిపోయిందని అధికారులు వెళ్లడించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తి నాసిరకంగా భవనాన్ని నిర్మిస్తుండడంతో పాటుగా ఈ భవనానికి సమీపంలో మరో భారీ భవన నిర్మాణా పనులు సాగుతున్నాయి. దీనికోసం భారీ గుంతలు తవ్వడం కూడా భవనం కూలిపోవడానికి కారణం అయింది.

బిల్డర్ సత్యనారాయణ సింగ్ ను పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. భవనం కూలిన తరువాత నుండి తప్పించుకునిపోయిన సత్తిని పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. భవనం కూలిన ఘటనకు బాధ్యులు ఎవరైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి మరికొంత ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలను వారి స్వంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.