పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్విల్ వే కాంక్రీటు పనులను అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరుతాయన్నారు. అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాహయపడుతోందని బాబు చెప్పారు. కేంద్ర సహకారం లేకపోతే ఇంత త్వరగా ప్రాజెక్టు పనులు జరిగేవి కాదన్నారు. పోలవరం ను ఒక యజ్ఞంగా భావించి నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకుంటున్న వేలాది మందికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో కీలకం జలాశయం. ఈ జలాశయం నుంచి అదనపు వరద నీటిని జలాశయం దిగువకు వదిలేందుకు వీలుగా స్పిల్‌వే, గేట్లు ఏర్పాటు చేస్తారు. రాతి మట్టి కట్ట డ్యాం నిర్మిస్తారు. స్పిల్ వేకు ఎగువన అప్రోచ్ ఛానల్, దిగువన స్పిల్ ఛానల్, ఆ తర్వాత పైలట్ ఛానల్ నిర్మాణాలు చేపట్టాలి. డ్యాం పునాదిగా డయాఫ్రం వాల్ నిర్మిస్తారు. అత్యంత కీలకమైన స్పిల్ వే పనులు ప్రారంభం కావడంతో ప్రాజెక్టు నిర్మాణం ఇక మరింత ఊపందుకోనుంది. రాతిమట్టి కట్ట చివర నుంచి స్పిల్ వే 1054.40 మీటర్ల పొడవున నిర్మిస్తారు స్పిల్‌వేను 150 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. ఈ స్పిల్‌వేకు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 17 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇది పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.