కేవలం వేలిముద్రల ద్వారా చెల్లింపులు చేసుకునే విధంగా కొత్త విధానాన్ని త్వరలోనే తీసుకుని వస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నగదు చెల్లింపులకు ఉపయోగ పడే “భీమ్” యాప్ ను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఆ తరువాత మోడీ మాట్లాడుతూ ఇంటర్నెట్ లేకుండా ఏ మొబైల్ ఫోన్ నుంచైనా ఉపయోగించుకునే విధంగా కొత్త విధానాన్ని త్వరలోనే రూపొందిస్తున్నట్టు చెప్పారు. మీ వేలిమద్రే మీ బ్యాంకు గా మారుతుందని మోడీ పేర్కొన్నారు. దేశాన్ని డిజిటల్ వైపు పరుగులు తీయించడం వల్ల ప్రజలందరికీ లబ్ది చేకూరుతుందని అన్నారు. దేశ ప్రజల్లో చదువురాని వాళ్లు ఉన్నారు అంటూ కొంత మంది నిరాశా వాదాన్ని లేవనెత్తుతున్నారని అటువంటి వారిని ఏమీ చేయలేమన్నారు. నిరాశావాదానికి మందేలేదని మోడి పేర్కొన్నారు. దేశంలో ఈవీఎం లు సులభంగా వాడగలిగినపుడు డిజిటల్ చెల్లింపులు ఎందుకు సాధ్యపడవని ప్రశ్నించారు. పెద్ద నోట్ల ను రద్దు చేసిన తరువాత దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని చెప్పారు. ఆధార్ తో అనుసంధానించి వేలిముద్రల ద్వారా చెల్లింపులు జరిగే పద్దతి వస్తే దేశంలో చాలా మార్పులు వస్తాయని మోడి చెప్పారు. దేశ ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారని మోడీ పేర్కొన్నారు.