రసవత్తరంగా నెల్లూరు రాజకీయం

నెల్లూరు జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజుకో ఆరోపణతో అటు సోమిరెడ్డి వర్గం, ఇటు కాకాని వర్గం కత్తుల నూరుకుంటున్నాయి. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నాలుగు దేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని ఆయనకు పవర్ ప్రాజెక్టుల్లో వాటాలు ఉన్నాయని దాదాపు వేయి కోట్ల రూపాయల ఆస్తులను సోమిరెడ్డి సమకూర్చుకున్నాడంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే , జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పంధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేసి శవ రాజకీయాలతో ఎమ్మెల్యే అయిన గోవర్థన్ రెడ్డికి తనపై ఆరోపణలు చేసే స్థాయి లేదన్నారు. తనకు అక్రమంగా ఆస్తులు ఉన్నట్టు నిరుపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. అక్రమ అస్తులు అంటూ ప్రచారం చేస్తున్న గోవర్థన్ రెడ్డి చూపెట్టినవి ఫోర్జరీ డ్యాక్యుమెంట్లను అంటూ దీనిపై విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసుపై సత్వరం విచారణ పూర్తిచేయాలని కోరుతూ సోమిరెడ్డి అమరావతికి వచ్చి డీజీపీని కలిశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంపై జిల్లా ఎస్పీ ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందం ఎమ్మెల్యేతో సహా పలువురిని విచారించింది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను విచారించారు.
మరో వైపు కాకాని గోవర్థన్ రెడ్డి తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. తాను ప్రజల ముందు ఉంచినవి నిజమైన డాక్యుమెంట్లేనని దీన్ని నిరూపించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. సోమిరెడ్డికి వ్యతిరేకంగా తాను ఆధారాలతో సహా నిజాలు బయటపెట్టేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిజాల్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి-కాకాని ల వ్యవహారంతో నెల్లూరు రాజకీయం వెడెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *