ఇంకెన్నాళ్లు…

ఒక్క 50 రోజులు ప్రధాన మంత్రి దగ్గర నుండి అధికార పక్ష నేతలంతా పటిస్తున్న మంత్రమిది. 50 రోజుల్లో అంతా మారిపోతుంది, కష్టాలన్ని తొలగిపోతాయంటూ చెప్పుకుంటూ వచ్చారు. 50 రోజులు పూర్తయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. నోట్ల కోసం గంటల తరబడి నిరీక్షణ, చిల్లర కోసం నానా పాట్లు తప్పడం లేదు. ఏటీఎం ల పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఎక్కడా ఏటీఎంలు పనిచేస్తున్న దాఖలాలు లేవు. అరకొరగా పనిచేస్తున్నా డబ్బులు నింపిన గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయి. డబ్బులున్న ఏటీఎంలు కనబడితే ఎడారిలో ఒయాసిస్సుల్లాగా వాటి ముందు జనం వాలిపోతున్నారు. గంటల సేపు వరుసలో నిల్చున్నా అందరికీ డబ్బు అందడం లేదు. చిల్లర వ్యాపారాలు దివాలే తీసే పరిస్థితులు కనిపిస్తుంటే రైతులు, కూలీలు,నిరుపేదల బతుకులు అధ్వాన్నంగా తయారయ్యాయి.
మొదట కొత్త నోట్లు వస్తున్నాయని సమస్యలు పోతాయని చెప్పినా ఆ తరువాత అసలు విషయాన్ని చెప్పారు ప్రభుత్వ పెద్దలు తమ ఉద్దేశం నగదు రహిత సమాజమని ఆ దిశగా అడుగు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక అందరూ ఎలక్ట్రానిక్ మనీనే వాడాలని సూచించారు. వారి సూచనల సరే దానికి తగినట్టుగా ఏర్పాట్లు కనిపించడం లేదు. నగదు రహిత లావాదేవీలపై పూర్తి స్థాయిలో అవగాహన లేక ప్రజలు లబోదిబో అంటున్నారు. నగరాల్లో పరిస్థితి కాస్తా మెరుగ్గానే ఉన్నా పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. చేతిలో చిల్లి గవ్వ లేక ప్రజలు అల్లాడుతున్నార. పట్టించుకునే నాధుడు లేక విలవిల్లాడుతున్నారు. వ్యాపారాలు జరగడం లేదు, వ్యవసాయం కుంటుపడింది, కూలీలకు పనుల్లేవు 50 రోజుల్లో అన్ని సమస్యలు సమసిపోతాయని చెప్పినా సమస్యలకు పరిష్కారం కనుచూపు మేరకు కనిపించడం లేదు.
ఒక పక్క కొత్త నోటు కోసం సామాన్యులు వెంపర్లాడుతుంటే పెద్దలకు మాత్రం కోట్లకు కోట్లు పెద్ద నోట్లు సులభంగా దొరుకుతన్నాయి. రిజర్వ్ బ్యాంకు నుండి నేరుగా పెద్ద మనుషుల ఇళ్లకే కొత్త నోట్లు చేరిపోయాయంటే పరిస్థతిని అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నా పెద్దల వద్ద మాత్రం కొత్త నోట్లు పోగుపడుతున్నాయి. ఆదాయపుపన్ను శాఖ దాడుల్లో కోట్లాది రూపాయల కొత్త నల్ల ధనం దొరుకుతోంది. ఈ స్థాయిలో కొత్త నోట్లు పక్కదారిపడతాయని ఆర్బీఐ పెద్దలు కూడా అంచానా వేయలేకపోయారు. తప్పెవది అయినా కష్టాలు మాత్రం సామాన్యులకే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *