హైదాబాద్ ను పంచుకున్న టీఆర్ఎస్, ఎంఐఎం

హైదారాబాద్ ను ఎం.ఐ.ఎం, టీఆర్ఎస్ లు కలిపి పంచుకుని భ్రష్టు పట్టిస్తున్నాయని తెలంగాణ టిడిపి వర్గింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాత నగరాన్ని ఎం.ఐ.ఎం, కొత్త నగరాన్ని టీఆర్ఎస్ లు పంచుకుని ప్రజలను వేధిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకుని అభ్యర్థులను నిలబెట్టాయని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చని సీఎం కేసీఆర్‌ను ఎంఐఎం నేతలు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. కేటీఆర్‌ సెల్ఫీలు దిగడంలో, కేసీఆర్‌ గొప్పలు చెప్పుకోవడంలోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కు పూర్వ వైభవం రావాలంటే తెదేపా వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.  చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్‌ నగరం బాగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుత తెరాస ప్రభుత్వం భాగ్యనగరాన్ని అప్పులపాల్జేస్తోందని  ఆయన అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఎంఐఎం పార్టీకి చెందిన జీవీజీ నాయుడు పలువురు కార్యకర్తలతో శనివారం తెదేపాలో చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు.