సొంత పార్టీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శలు

నెహ్రు కుంటుంబం పై విమర్శలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బీజీపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సొంత పార్టీని ఇరుకున పెట్టాడు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఆయన బాహాటంగా విమర్శలు గుప్పించడంతో బీజేపీ ఇరుకున పడింది. ఏబీపీ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన శిఖర్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో సుబ్రమణ్యస్వామి తన సొంత పార్టీ నేతలపైనే విరుచుకుని పడ్డారు. మోడీ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఆయన దేశానికి ఆర్థికవేత్త అయిన ఆర్థిక మంత్రి అవసరమని, కేవలం 2+2=4 అని చెప్పేవాళ్లు కాదంటూ పరోక్షంగా అరుణ్‌జైట్లీని ఉద్దేశిస్తూ స్వామి విమర్శించారు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించేందుకు వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించారు.నోట్ల రద్దు తర్వాత దేశంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడంలో ప్రధాని విఫలమైతే..ప్రజాదరణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదముందని స్వామి హెచ్చరించారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు కూడా ఆరు నెలలపాటు ప్రజల నుంచి ఆమెకు ఆదరణ ఉండేదని, ఆ తర్వాత వ్యతిరేకంగా మారిందని స్వామి గుర్తు చేశారు. యువతలో మంచి క్రేజ్ ఉన్న ప్రైర్ బ్రాండ్ ఎంపీ సొంత పార్టీ పైనే విమర్శలు చేయడంతో ఆ పార్టీ  ఇరుకున పడినట్టయింది. ఆయన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల నుండి స్పందన రాలేదు.