సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా-న్యూజిల్యాండ్ ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల చాపెల్-హ్యాడ్లీ  వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. న్యూజిల్యాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఆష్ట్రేలియా 116 పరుగులు భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడాడు వార్నర్ 115 బంతుల్లో 119; 14 ఫోర్లు,ఒక సిక్స్ తో  సెంచరీ సాధించాడు. వార్నర్ కెరీర్‌లో ఇది పదో సెంచరీకాగా… ఈ ఏడాది ఆరోది. ఒకే ఏడాదిలో అత్యధికంగా ఆరు సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌గా వార్నర్ గుర్తింపు పొందాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (72; 6 ఫోర్లు, ఒక సిక్స్), ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (40 బంతుల్లో 76; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధాటిగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. 379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 47.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (81; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నీషమ్ (74; 7 ఫోర్లు, ఒక సిక్స్) మూడో వికెట్‌కు 125 పరుగులు జోడించారు.