శశికళకు వ్యతిరేకంగా ఆందోళన

జయలలిత మరణంతో ఖాళీ అయిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని జయలలిత నెచ్చెలి శశికళ చేపట్టారంటూ వార్తలు వచ్చినా వాటిని అన్నా డీఎంకే వర్గాలు అధికారికంగా ఖరారు చేయడం లేదు. శశికళ పై పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులతో సహా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నందు వల్ల శశికళకు పార్టీ కార్యదర్శి పదవిని అప్పగించడంలో ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ పేరు ఖరారైనట్టు తొలుత వార్తలు వచ్చినా వాటిని అధికారికంగా ఎవరూ దృవీకరించడంలేదు.

పార్టీ కార్యదర్శి పదవిని శశికళ చేపడుతున్నారంటూ ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు శశికళ ప్రస్తుతం నివాసం ఉంటున్న జయలలిత కు చెందిన ఇల్లు పోయస్ గార్జెన్ కు చేరుకున్నారు. శశికళకు వ్యతిరేకంగా కొంత మంది నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకోవాలనుకుంటున్న శశికళకు ఈ పరిణామం గట్టి ఎదురుదెబ్బగానే బావిస్తున్నారు.

జయలలిత మరణం తరువాత పార్టీలో శశికళపై వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటుగా అమెపై విమర్శలు కూడా పెరిగాయి. జయలలిత మరణం పై విచారణ జరపాలని జయలలిత మేనకోడలు డిమాండ్ చేసిన తరువాత ప్రముఖ నటి గౌతమి కూడా ఇదే విధమైన డిమాండ్ చేశారు. తాజాగా జయలలిత చెల్లెలి కుమారై కూడా శశికళపై విరుచుకు పడ్డారు.