విజయ్ దివస్ రోజున- సరిహద్దులో తీవ్ర ఉధ్రిక్తత

భారత్-పాక్ సరిహద్దుల్లో తిరిగి ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. భారత్ లోని సైనిక స్థావరాలు, జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ భారీగా కాల్పులకు తెగబడింది. పెద్ద ఎత్తున పాకిస్థాన్ సైనికులు కాల్పులకు దిగారు. జమ్మూకాశ్మీర్ లోని పుంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ పై పాకిస్థాన్ మోర్టార్ల తో దాడులు చేసింది. భారీ ఎత్తున బాంబులు కురిపించింది. దీనితో బాంబుల మోతతో ఈ ప్రాంతాలు దద్దరిల్లాయి. ప్రతిగా భారత్ సైన్యం కూడా ఎదురుదాడికి దిగింది. భారీ ఎత్తున భారత్ సైనికులు కాల్పులు జరిపారు. తేలికపాటి ఆయుధాలతో పాటుగా భారీ ఆయుధాలతో పాక్ కు బుద్దిచెప్పారు. భారత్ వైపు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సైన్యం ప్రకటించింది. భారత్ జరిపిన కాల్పుల్లో ఒక బస్సు డ్రైవర్ మృతి చెందాడని, విద్యార్థులు గాయపడ్డారని పాక్ ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పాకిస్థాన్ లోని జనావాసాలపై భారత్ ఎటువంటి దాడి జరపలేదని స్పష్టం చేసింది.

1971 బాంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ అదే రోజున భారత్ పైకి కాల్పులకు తెగబడడం గమనార్హం. 1971లో భారత్ యుధ్దంలో పాకిస్థాన్ పై గెల్చిన రోజును పురస్కరించుకుని విజయ్ దివస్ గా నిర్వహించుకుంటున్న రోజున భారత్ పై పాకిస్థాన్ కాల్పులకు తెగబడింది. అయితే భారత బలగాలు ధీటుగా జవాబు చెప్పడంతో భారత్ జనావాసాలపై దాడి చేస్తోందంటూ గగ్గోలు పెడుతోంది.