రెండు రూపాయలకే కిలో టమాట

తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కిలో రెండు రూపాయలు కూడా పలకడం లేదు. దీనితో టమాట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతులు తమ పంటను ఐన కాడికి అమ్ముకుంటున్నారు. కనీసం తమకు రవాణా ఖర్చుకు కూడా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. కిలోకి మూడు రూపాయల ధర కూడా రాకపోవడంతో తీసుకుని వచ్చిన టమాటాను మార్కెట్ ల వద్ద కింద పడేసి వెళ్లిపోతున్నారు. గిట్టుబాటు ధర అటుంచి కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

టమాటాలను తీసుకుని నిత్యం వందలాది లారీలు హైదరాబాద్ కు వస్తుంటాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుండి టమాటలను తీసుకుని రైతులు వస్తుంటారు. టమాట సరఫరా పెరిగిపోవడం డిమాండ్ తగ్గిపోవడంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బహిరంగ మార్కెట్ లో కిలో ఎనిమిది నుండి పది రూపాయలు పలుకుతున్నా రైతుల వద్ద నుండి వ్యాపారులు కిలో కు రెండు రూపాయల కన్నా ఎక్కువ ధర ఇవ్వడం లేదు. దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇతర కూరగాయల మాదిరిగా టమాటాలను నిల్వచేసుకునే అవకాశం లేదు. కనీసం ఒకటి రెండు రోజులు కూడా టమాటాలు నిల్వ ఉండవు దీనితో ఐన కాడికి అమ్ముకోవడం లేదా రోడ్ల మీద పారబోసి పోవడం తప్ప తమకు వేరే గత్యంతరం లేదని రైతులు వాపోతున్నారు.