మేమేం తక్కువకాదని నిరూపించిన బ్యాంకు ఉద్యోగులు

0
9

అవకాశం రావాలే కాదు అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాందించేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారనే విషయంలో పెద్ద నోట్ల కట్టలతో మరోసారి బయటపడింది. సాధారణంగా అవినీతి జాడ్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే ఎక్కువ అని చెప్పుకుంటారు అయితే అవకాశం రావాలి కానీ మేమేం తక్కువ కాదు అని నోట్ల రద్దు నిర్ణయం తరువాత జరిగిన పరిణామాలతో బ్యాంకు ఉద్యోగులు తేల్చేశారు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో మందిని రోడ్డుమీద నిలబెట్టింది. వ్యాపారాలు, వ్యవసాయం నష్టపోయి జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నిర్ణయం కొంత మందికి కాసులను పండిస్తోంది.
నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అవి మార్చుకోవడానికి 50 రోజుల పాటు గడవు విధించింది. కొత్త నోట్లను బ్యాంకులకు పంపించింది. ఇక్కడే అక్రమాలకు తెరలేచింది. వారానికి 10వేలు, నెలకు 24వేలు అంటూ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తుంగలో తొక్కి బ్యాంకు ఉద్యోగులు కొందరు తమకు కావాల్సిన వారికి దొడ్డిదారిన కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. గంటల తరబడి బ్యాంకుల లైన్లలో నిలబడినా సామాన్యుడికి రెండు వేలు రావడం గగనం అయిపోతే అక్రమ మార్గాల ద్వారా కోట్లది రూపాయలు పెద్దలకు మాత్రం చేరిపోయాయి.
కమీషన్ కు ఆశపడిన బ్యాంకు ఉద్యోగులు అక్రమ మార్గాల ద్వారా డబ్బును తరలించారు. బ్యాంకుల్లో సామాన్యులు ఇచ్చిన దృవపత్రాలను ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడుతున్న కోట్లాది రూపాయల కొత్త నోట్లు బయటకు ఎట్లా వచ్చాయని ఆరా తీసిన దర్యాప్తు బృందాలకు బ్యాంకు, పోస్టాఫీసు ఉద్యోగుల చేతివాటం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు కూడా తాము ఏ మాత్రం తక్కువ తినలేదని నిరూపించారు. సామాన్యుడికి అందాల్సిన కొత్తనోట్లు బడాబాబుల ఇనపెట్టెల్లోకి చేరిపోయాయి. దీనితో నగదు కొరత మరింత ఎక్కువ అయింది.
శుభకార్యాలు ఇతర అత్యంత అవసరమైన పనులకు డబ్బులకు డబ్బులు కావాలన్నా రకరకాల ప్రశ్నలతో నిబంధనలతో నగదు ఉపసంహరణకు ఒప్పుకోని బ్యాంకు అధికారులు తమకు నచ్చిన వారికి మాత్రం కోట్లాది రూపాయలు పక్కదారిలో ఇస్తున్నాయి. నిబందనలు కేవలం సామాన్యుడికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న నగదు కొంత మాత్రమే అంతకు ఎన్నో రెట్ల కొత్త నోట్లు ఇప్పటికే అందాల్సిన వారికి అందిపోయాయి. సమాన్యుడు మాత్రం రోడ్లమీద గంటలతరబడి క్యూలలో నిల్చుంటుంన్నారు. అవకాశం వస్తే మేం మాత్రం తక్కువా అని బ్యాంకు ఉద్యోగులు నిరూపించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here