మరో నెలరోజులు తిప్పలు తప్పవు…

పెద్ద నోట్ల రద్దు తరువాత నెలకొన్న పరిస్థితుల నుండి సాథరణ స్థితికి చేరుకోవడానికి ఇంకా నెలరోజుల సమయం పడుతుందని ఆర్బీఐ అధికారులు వెళ్లడించారు. తెలంగాణలో నోట్ల రద్దు తరువాత నెలకొన్న పరిస్థితులను గురించి చర్చేందుకు రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహ్మా రెడ్డి లు రిజర్వ్ బ్యాంకు అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నగదు కొరతకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి మంత్రులు ఆర్బీఐ అధికారులకు వివరించారు. పరిస్థితి తిరిగి సాధారణంగా మారడానికి మరో నెలరోజులు పడుతుందని అర్బీఐ అధికారులు వెళ్లడించారు.

రాష్ట్రానికి 20వేల కోట్ల రూపాయల కొత్త నోట్లు రావాల్సి ఉండగా 17వేల కోట్ల రూపాయల నోట్లు మాత్రమే వచ్చాయని అవి కూడా 96శాతం పెద్ద నోట్లు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఈటెల తెలిపారు. వెంటనే చిన్న నోట్లను విడుదల చేస్తేనే పరిస్థితి సర్థుమణుగుతుందని ఆయన చెప్పారు. చాలా గ్రామాల్లో పేదలు బ్యాంకు ఖాతాలు లేవని అట్లాంటి వారు దళారుల చేతుల్లో మోసపోకుండా నోట్లను మార్చుకునే సౌకర్యం కల్పించాలని ఈటెల డిమాండ్ చేశారు.

బ్యాంకు అకౌంట్లు లేనివారికి వెంటనే కొత్త ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఈటెల కోరారు. నగదు రహిత కార్యకలాపాలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం అన్ని శాఖలు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

పెద్దనోట్లు రద్దు కావడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారి ఇబ్బందులను దూరం చేయాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు. రెండు వేల రూపాయల నోట్లకు చిల్లర దొరక్క పేద ప్రజలు చాలా పాట్లు పడుతున్నారని కూలీలు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అటువంటి వారిని ఆదుకోవడం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని నాయిని సూచించారు.