చిన్న జీయర్ స్వామి వారి ధనుర్మాస ప్రవచనం

అత్యంత పవిత్రమైన ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్య భగవానుడు దనూ రాశి లో ప్రవేశంచిన నాటి నుండి  ముప్పయి రోజుల  కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ మాసంలోనే శ్రీ రంగనాథున్ని    భర్తగా పొందడానికి గోదా దేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ శ్రీ రంగనాథున్ని  ప్రసన్నం చేసుకుంటుంది. గోదా దేవి స్వయంగా  రచించి గానం చేసిన “ తిరుప్పావై” పాశురాలు (పాటలు) రోజుకొకటి చొప్పున పాడితే కోరిన కోరికలు నేరవేరుతాయత  .తమిళనాట ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి పతిని ప్రసాదించమని పార్వతి దేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉందట . ఆ కోవకు చెందినదే తిరుప్పావై. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది.

ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి ?

పరాశరబట్టర్ గోదాదేవిని ఇలా స్తుతించాడు

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

ప్రకృతిని నీళా అని అంటారు, అందమైన ఆ ప్రకృతిలో పరమాత్మ పవళించి అణువణువునా ఉంటాడు. ఇంత అందమైన ప్రకృతిని చూసి అందరం ఆనందిస్తాం, కాని దాని వెనకాతల కారణభూతుడైనవాన్ని ఎప్పుడైనా గుర్తిస్తున్నామా అనేది సంశయమే!!. ఇలాంటి మన ప్రవృత్తికి విసిగి, ఎవరి ఆదరణ లేక చివరికి ఆయనకూడా నీళా వక్షసీమలో మగ్నమై ఉన్నాడు. గోదాదేవి ప్రకృతిలో అంతర్గతమైన ఆ కృష్ణున్ని లేపింది. మనకూ ఆయనకు ఉండే సంబంధాన్నిఆయనకు నేర్పింది. మనకు దూరంగా ఉండే పరమాత్మను, మనలో నిండి ఉన్న పాపాలను కనబడకుండాచేసి, ఆయనకున్న స్వతంత్రతను పక్కకు జరిపి, ఇద్దరిని దగ్గరికి చేసి మురిసింది. మనలో ఆయనను కలిసి ఉండేట్టుగా చేసింది. పారార్థ్యం అనగా మనకి ఆయనకి పాటం చెప్పిన గొప్ప అధ్యాపయంతీ-అధ్యాపిక మన అమ్మ గోదా. ఆయన మాట అనగలడు, విడువగలడు. భారతంలో ఆయుదం పట్టను అన్నాడు, కాని ఒకటి రెండు సార్లు ఆయుదం పట్టినాడు కదా!!, ఆయన కృపకోసం తనను తానే సమర్పించి, స్వామి సన్నిధానంలో మన కోసం చేరి ఉంది. వేదాలు, ఉపనిషత్తులు చూపిన మార్గము మనకూ చూపించింది.

“ఓంకార ప్రభవా: వేదా:” వేదాలన్ని ఓం కారంలోనుండి వచ్చాయి కాబట్టి, ఓం కార అర్థం తెలుసుకోవలని మన శాస్త్రాలలో చెప్పారు.
ఉపనిషత్తులు ఇలాచెప్పాయి

” ప్రణవో ధను: శిరోహ్యాత్మా బ్రహ్మత లక్ష్య ముచ్యతే |
అప్రమత్తేన వేత్తవ్యం శరవతన్మయో భవేత్ || ” అని చెప్పాయి.

“ప్రణవో ధను: ” ఓంకారాన్ని ధనుస్సు తో పోలుస్తారు. “శిరోహ్యాత్మా ” జీవుడే భాణం, “బ్రహ్మత లక్ష్య ముచ్యతే” లక్ష్యం బ్రహ్మమే. బ్రహ్మం అంటే ఆనందం, ఇంతకంటే మించి ఉండనిది, ఎప్పటికీ తరగనిదై ఉండేది. “అప్రమత్తేన వేత్తవ్యం ” పరాక్కు పనికిరాదు, ఏకాస్తా అజాగ్రత్తగా ఉన్నా జారిపోగలం సుమా!! అని హెచ్చరిస్తున్నాయి ఉపనిషత్తులు.
అలాంటి ఆనందాన్ని పొంది మనకూ చూపించింది మన అమ్మ గోదా.

“కృష్-ణ” అంటే అపరిమితమైన-ఆనందం. ఎక్కడ ఉంటుంది ఈ ఆనందం ? మన కంటికి కనిపించేవి ప్రాపంచిక వస్తువులే, నీకు కనిపించే ఈ వస్తువుల్లో ఇమిడి ఉందని గుర్తించాలి. అలా గుర్తించటానికి మనలో సత్వగుణం పెరగాలి. మనలో ఉండే రజస్సు, తమస్సు గుణాలు అణిగిపోవాలి. మన చేతిలోని చూపుడు వేళు మన ఆత్మని సూచిస్తుంది, ఇక దాని పక్కన ఉన్న మూడువేళ్ళు రజస్సు,తమస్సు,సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేళు సాత్వికాన్ని తెలియ జేస్తుంది. అది చిన్నదై ఉంటుంది. ఇక బ్రొటనవేళు పరమాత్మ ను సూచించినట్లయితే, చూపుడు వేళును బ్రొటన వేళు వైపు వంచడమే జ్ఞాన ముద్ర. ఈ సాధననే ధనుర్మాస ఆచరణ. ధనుర్మాసవ్రతం మనలోని సత్వాన్ని పెంచుతుంది. ధనుర్మాసం అంటే ఓంకారం. ఈ సమయంలో మన జ్ఞానం వికసించగలిగితే, మన ఆనందం ఏమిటో మనకు తెలుస్తుంది. భాణం లోని ములుకు ఆత్మ అయితే భాణం యొక్క పుల్ల శరీరం లాంటిది. ఈ అత్మకు లక్ష్యం పరమాత్మే, కాబట్టి ఈ శరీరాన్ని ఎలావాడుకోవాలో మనకు తెలుస్తుంది.

అందుకే ఈ భగవన్మయ మైన మార్గశీర్శమాసాన్ని అందరూ వినియోగించుకోవాలి.

జై శ్రీమన్నారాయణ
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం.