ప్రధాని ఎందుకు స్పందించరు:సీపీఐ

పెద్దనోట్ల రద్దు వ్యవహారం పూర్తిగా గందరగోళంగా తయారైందని సీపీఐ అభిప్రాయపడింది. ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్యులు గంటల తరబడి క్యూలలో నిల్చున్నా కొత్త నోట్లు లభించడం లేదని కొంత మంది బడా బాబుల వద్ద మాత్రం కోట్లాది రూపాయలు ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. నల్ల ధనం పేరుతో ప్రజలను ప్రధాన మంత్రి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కోట్లాది రూపాయల కొత్త నోట్లు దొరుకుతున్నా దీనిపై ప్రధాన మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని సురవరం ప్రశ్నించారు.  దేశ ఆర్థిక పరిస్థితి ఆశావాహకంగా లేదని, ఎగుమతులు పడిపోతున్నాయని, నోట్ల రద్దుతో వృద్ధి రేటు కూడా 5 శాతానికి పడిపోనుందని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఆర్థక్రాంతి సంస్థ నోట్ల చెలామణికి బదులుగా బ్యాంక్‌ల ద్వారా లావాదేవీలు చేపట్టాలని సూచిస్తోందని సురవరం అన్నారు. ఆదాయ పన్ను సహా అన్ని పన్నులు రద్దు చేసి బ్యాంక్ లావాదేవిలపై పన్ను విధించాలని ఆ సంస్థ చెబుతోందని, ఇది కార్పొరేట్ సంస్థలకు లాభమని, సామాన్యులపై పన్నుల భారంగా పరిణమిస్తుందన్నారు. ఇలాంటి అపరిపక్వ, అశాస్త్రీయ, మిడిమిడి జ్ఞానంతో ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు ప్రజలపై నోట్ల రద్దును రుద్దుతున్నాయని మండిపడ్డారు.

మోడీ ప్రధాని అయ్యాక దేశంలో మతతత్వ శక్తుల అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. దేశాన్ని మతపరంగా విభజించడానికి సంఘ్ పరివార్ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. గో రక్షణ పేరుతో అరాచాలు జరుగుతున్నాయన్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు తమ పార్టీ శాయశక్తులా పనిచేస్తుందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు ప్రతీ కార్యకర్తా నడుంబిగించాలని సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.