హైదరాబాద్ పోలీసులపై మహేశ్ పోస్ట్
సెల్యూట్ అంటోన్న సూపర్‌స్టార్
హైదరాబాద్: దేశంలో కరోనా కల్లోలం అధికమౌతోన్న తరుణంలో దాని కట్టడికి నిర్విరామంగా పనిచేస్తోన్న పోలీసులను ఉద్దేశిస్తూ ప్రముఖ నటుడు మహేశ్ బాబు ట్విటర్లో ఓ ట్వీట్ పెట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘కొవిడ్-19పై మన దేశం చేస్తున్న యుద్ధంలో అహర్నిశలు కష్టపడుతోన్న తెలంగాణ పోలీసు యంత్రాంగానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కోసం నిర్విరామంగా వారు అందిస్తున్న సేవలు అసాధారణమైనవి. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మన ప్రాణాలతోపాటు, మన కుటుంబసభ్యుల జీవితాలను కాపాడుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు. మనదేశం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ నిస్వార్థమైన అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నాను’ అని మహేశ్ ట్వీట్ చేశారు.