పవన్ కళ్యాణ్ లో మార్పుకు కారణం ఎంటి?

భారతీయ జనతా పార్టీకి గట్టి మద్దతుదారుడిగా పేరున్న జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వరుసగా బీజేపీ పై విమర్శల వర్షం కురిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో పాటుగా బీజేపీకి తరపున ప్రచారం కూడా నిర్వహించిన పవన్ ఇప్పుడు హాఠాత్తుగా ఎందుకు ప్లేటు మార్చాడా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై కూడా నేరుగా బీజేపీని విమర్శించకుండా బహిరంగ సభలో జాగ్రత్తలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా బీజేపీ పై ఘాటుగా విమర్శలు చేయడం చూస్తుంటే పవన్ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ నేరుగా బీజేపీ పై విమర్శలు చేస్తున్నా ఆయన లక్ష్యం ఆర్ఎస్ఎస్ గానే కనిపిస్తోంది. గోవధ నిషేధం లాంటి సున్నిత అంశాన్ని లేవనెత్తిన పవన్ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేశారు. దాదాపు సంవత్సరం తరువాత రోహిల్ వేముల ఆత్మహత్య విషయాన్ని ప్రస్తావించడం ద్వారా కొన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకే పవన్ ఇటువంటి విమర్శలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా ధియేటర్లలో జాతీయ గీతం అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా పవన్ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఐతే ధియోటర్లలో జాతీయ గీతం ప్రదర్శించాలనే నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం కాకున్నా పవన్ ఆధికార పార్టీ పై విరుచుకుని పడ్డారు.

పవన్ విమర్శలు చూస్తుంటే బీజేపీ హిందుత్వ ఎంజేడాను లక్ష్యంగా చేసుకుని చేసిననట్టు కనిపిస్తోంది. మరి హఠాత్తుగా పవన్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో రాబోయే కాలంలో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.