నేను మాట్లాడితే భూకంపమే:రాహుల్

తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు పై చర్చకు విపక్షాలు శుక్రవారం కూడా ఆందోళన చేశాయి. ఓటింగ్ కు వీలు కలిగించే షరతుపై తాము చర్చకు సిద్ధమని విపక్షాలు అంటుండగా అధికార పక్షం మాత్రం ఓటింగ్ అవసరం లేకుండా చర్చకు సిద్ధమంటోది. అటు ప్రభుత్వం, ఇటు విపక్షం రెండూ మంకు పట్టుకు పోవడంతో పార్లమెంటులో ఎటువంటి చర్చ జరగడం లేదు. పార్లమెంటులో చర్చ జరక్కపోవడానికి ప్రభుత్వ మంకుపట్టే కారణమని రాహుల్ గాంధీ విమర్శించార. పార్లమెంటు వాయిదా పడిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.

లోక్ సభలో తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని అయితే తన మాటలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తనకు కనిపించడం లేదని అన్నారు. నోట్ల రద్దు వ్యవహారం దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని రాహుల్ ఆరోపించారు. ఈ విషయాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్  చెప్పారు. తాను సభలో మాట్లాడితే చాలా విషయాలు బయటికి వస్తాయని రాహుల్ పేర్కొన్నారు.

దేశమంతా పర్యటించి మాట్లాడే ప్రధాన మంత్రికి పార్లమెంటులో మాట్లాడేందుకు మాత్రం సమయం సరిపోవడం లేదని రాహుల్ ఎద్దేవా చేశారు.