నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు…

ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు ఉన్న అధికారాలు అపారం. దేశాన్ని పాలించేది, శాసించేది చట్టసభలే. అట్లాంటి చట్ట సభలు నిర్వీర్యమై పోతున్నాయి. అర్థవంతమైన చర్చలకు వేదికలుగా నిలవాల్సిన సభలు అవేశకావేశాలు, వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ప్రయోజనాలకు వేదికలు మారుతున్నాయి. చర్చలు పక్కదారి పట్టడం మాట అటుంచితే అసలు చట్ట సభలు నలవనే నడవడం లేదు. చట్ట సభలకు కనీసం పాస్ మార్కులు కూడా పడడం లేదు. వందకు గాను లోక్ సభ, రాజ్యసభ లు  కేవలం 20శాతానికి లేపే జరుగుతున్నాయి.

దేశంలోని దాదాపుగా 86 శాతం నోట్లు రద్దయ్యాయి, ప్రజలంతా డబ్బులకోసం అల్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా ప్రజలపై నేరుగా ఈ స్థాయిలో ప్రభావం పడ్డ అంశం ఇటీవల కాలంలో మరొకటి లేదు. ఇట్లాంటి సమయంలో చట్ట సభల సమావేశాలు మొదలు కావడంతో వాటిలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని భావించిన ప్రజల ఆశ నిరాశగానే మిగిలింది. తమ కష్టాలను తమ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తేస్తారని ఆశించిన ప్రజలకు భంగపాటు తప్పలేదు. తప్పు మీదంటే మీదని అధికార విపక్షలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్పిస్తే నోట్ల రద్దు చర్చను ఆశించడమే తప్పు అన్న చందగా పరిస్థితి తయారయింది.

చర్చకు సిద్ధం అని అటు విపక్షాలు, ఇటు అధికార పక్షం ప్రకటిస్తున్నది కానీ పార్లమెంటులో చర్చ మాత్రం జరగడం లేదు. ఉభయ సభలు వాయిదా మీద వాయిదా పడుతూ వచ్చాయి. నెపాన్ని అధికార విపక్షలు ఒకరిపై ఒకరు వేసుకోవడం తప్పిస్తే కాస్త పట్టువిడుపు ధోరణిలో ఇరు పక్షాలు వ్యవహరించడం లేదు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఇద్దరూ పార్లమెంటు జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితికి ప్రతిపక్షాలతో పాటుగా అధికార పక్షానిదీ తప్పు అని గట్టిగా చెప్పినా ఎవరిలోనూ చలనం కనిపించడం లేదు. ఎవరికి వారు మంకుపట్టులకు పోయి అత్యంత విలువైన సభసమాయాన్ని వృద్ధా చేస్తున్నారు.

పార్లమెంటు జరుగుతున్న తీరు ఏవగింపును కలిగిస్తోంది. దేశ ప్రజల సమస్యల మీద చర్చలు జరపాల్సిన చట్ట సభలు రాజకీయ చదరంగానికి వేదికలు అవుతున్నాయి. ప్రతీ ఒక్కరూ తమ రాజకీయ ప్రయోజనాలకు తప్పించి దేశ ప్రజల సౌభాగ్యం గురించి ముందుకు వస్తున్నట్టు కనిపించడం లేదు. వైరి పక్షంపై పై చేయి సాధించాలనే తపన తప్ప ప్రజా శ్రేయస్సు పట్టడం లేదు. ప్రభుత్వానికి సూచనలు చేయాలన్న ఆలోచన ప్రతిపక్షానికి లేదు సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేనప్పుడు ఇంతకాన్నా ఎక్కువ ఆశించడం ప్రజల తప్పే అవుతుంది.

చట్టసభలు ప్రస్తుతం జరుగుతున్న తీరు దారుణంగా తయారైంది. దీనికి తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అందరూ భాగస్వాములే. అధికార విపక్షలు ఎవరికి వారు తమ పాత్రను సమర్థవంతగా పోషిస్తున్నారు. చట్టసభలు నిర్వహించేందుకు ఈ దేశ ప్రజలు గంటకు 1.5కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మరి ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గంగలో కలిపిన మన ఘనత వహించిన ప్రజాప్రతినిధులని ఏమనాలి. దేశానికి దిశా నిర్థేశం చేయాల్సిన నేతలు చట్ట సభల్లో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది.

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా చట్టసభలో మన గౌరవ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మారకుంటే దేశ ప్రజలు ఈ నేతలందరినీ ఈసడించుకునే రోజులు ఎక్కువ దూరంలో లేవు.