నయీం దోస్తుల చిట్టా మొత్తం ఉంది:సీఎం

కరుడుగట్టిన నేరగాడు నయీంతో సంబంధాలు ఉన్న అందరి చిట్టా తమ ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. నయిం ఎన్ కౌంటర్, అరాచకాలకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం నయీంను ప్రాణాలతో పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. నయీంను పట్టుకొనేందుకే పోలీసులు ప్రయత్నించారని అయితే పోలీసులపై కాల్పులు జరపడంతో  పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడని సీఎం చెప్పారు. నయీంతో సంబంధాలు ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశక్తిలేదని సీఎం అన్నారు. ఇప్పటివరకు నయీంకు సంబంధించి 174 కేసులు నమోదు అయ్యాయని రెండు చార్జీషీట్లు దాఖలు చేయగా మరో 15 ఛార్జ్ షీట్లను త్వరలోనే దాఖాలు చేస్తామని చెప్పారు.

నయీం కేసుకు సంబంధించి 124 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. 741 మందిని విచారించారని వెల్లడించారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో ఎలాంటి లోపంలేదన్నారు. ఈ కేసును సీబీఐ కి బదలాయించాలన్న డిమాండ్ ను సీఎం తోసిపుచ్చారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని  ఆ విధంగా చేస్తే మన పోలీసులను అవమానించినట్టేనన్నారు. నయీంతో సంబంధాలు ఉన్న అందరి పేర్లు సమయం వచ్చినప్పుడు వెళ్లడిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ నయీం అరాచకాలు కోవలం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదని అందువల్ల సీబీఐ విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు రాజకీయ ప్రాధాన్యత ఉన్నందును రాష్ట్ర పోలీసులు సరిగా దర్యాప్తు చేసే అవకాశం లేదని వారిపై ఒత్తిడులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. నయీంకు సంబంధించిన డైరీని ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు.

నయీం అరాచకాలు కాంగ్రెస్ కాలంలోనే ఎక్కువగా జరిగాయన మంత్రి ఈటెలరాజేందర్ అన్నారు. నయీంను మట్టుపెట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు తీసుకుందని అంటున్న కాంగ్రెస్ సభ్యులు వారి హయాంలో నయీంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నయీం లాంటి సంఘ వ్యతిరేక శక్తులకు తెలంగాణలో స్థానంలేదని అరాచక వాదులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని ఈటెల స్పష్టం చేశారు.