నగదు రహిత రాష్టంగా తెలంగాణ

నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ోపాటుగా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సంకల్పించడంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీం పూర్ ఇప్పటికే పూర్తి నగదు రహిత లావాలేదవీలను నిర్వహిస్తున్న గ్రామంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం ఇదే విధమైన విధానాన్ని తీసుకుని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

నగదు లభ్యత, నగదు సరఫరా తదితర అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో జరిగేవే అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మొత్తం లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. తద్వారా నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వమే ముందడుగు వేస్తోంది.

మరో వైపు తెలంగాణ వ్యాలెట్ ను రూపొందించడంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్రపోషిస్తున్నారు. అత్యంత ఆధునికంగా, వినియోగదారులకు సులభంగా అర్థం అయ్యే విధంగా ఈ వ్యాలెట్ ఉండాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా ఆఘమేగాల మీద వ్యాలెట్ ను రూపొందిస్తోంది. దీనిలో భాగంగానే ఒక వ్యాలెట్ నుండి మరో వ్యాలెట్ కు పైకం మార్చుకునే సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. దీని వల్ల నగదు రహిత లావాదేవీల్లో కీలక ముందడుగు అవుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం అవసరం అయితే నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి చట్టంలో సరవణలు తీసుకుని రావలని కోరే అవకాశం ఉంది.

టీవ్యాలెట్ ను ఏదో మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఉపయోగ పడే విధంగా తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.