నగదు రహితం సాధ్యమేనా?

పెద్ద నోట్ల రద్దు తరువాత దేశంలో విచిత్రకర పరిస్థితులు నెలకొన్నాయి. నోట్ల రద్దుతో కరెన్సీకి విపరీతమైన కొరత ఏర్పడింది. బ్యాంకులు, ఏటీఎం ల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. ప్రజల అవసరాలను బ్యాంకులు ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. ఈ క్రమంలో నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం అంటూ ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను తీసుకుని పోయే విధానాలకు శ్రీకారం చుట్టాయి. భారత్ లాంటి దేశంలో ఇట్లాంటి కార్యక్రమం అసలు ఎంత వరకు విజయవంతం అవుతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నం.మనదేశంలో ఆర్థిక లావాదేవీలన్నీ నమ్మకమే ప్రధానంగా సాగుతుంటాయి. ప్రజల నైతిక ఆలోచనా సరళి కూడా ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఇప్పటివరకు దేశంలో 68 శాతం మంది నగదు వినియోగానికి అలవాటుపడి ఉన్నారు. అంతేకాక 33శాతం మంది నగదు రహిత పద్ధతుల పట్ల విముఖత చూపుతున్నారు. అంటే వారికి నగదులేని లావాదేవీ విధానం రుచించడం లేదు. అందుకే నగదు వినియోగ అలవాటును మానుకోలేక నగదు రహిత డిజిటల్‌ విధానాన్ని నిరోధిస్తుంటారు. ముఖ్యంగా మనదేశ విపణిలో నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఉంది. నగదు రూపంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. మన క్రయ విక్రయాలలో నగదు రూపంలో చెల్లిస్తే ఒక ధర, చెక్కు రూపంలో చెల్లిస్తే మరొక ధరగా చెలామణి అవుతుంటుంది. దీని వల్ల ఆన్‌లైన్‌ చెల్లింపులకు వ్యతిరేకత ఎదురవుతుంటుంది. అక్షరాస్యత, అవగాహన తక్కువ ఉన్నందువల్ల 35శాతం మంది గ్రామీణులు ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో సంక్షిష్టత కారణంగా నగదు చెల్లింపులవైపు మొగ్గు చూపుతుంటారు. ఇక దేశంలోని చాలా ప్రాంతాలలో డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థలు అందుబాటులో లేని కారణంగా నగదు రహిత లావాదేవీలకు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఎటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అధ్యయనం చేయకుండా, వాటిని అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తన విధానాలను సమర్థించుకుంటోంది. నగదు రహిత లావాదేవీల వల్లే దేశంలో అవినీతిని అంతం చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ధిశగా చర్యలు తీసులను మరింత ముందుకు తీసుకుని వెళ్తోంది. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగం గణనీయంగా పెరిగిన నేపధ్యంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిచడంలో ఎటువంటి అవరోధాలు ఎదురుకావనేది ప్రభుత్వ వాదన.