నగదు ఉపసంపరణ పరిమితి త్వరలో ఎత్తివేత

వీలున్నంత తొందరలో నగదు ఉపసంహరణ పై ఉన్న పరిమితులను ఎత్తివేస్తామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్‌ పటేల్‌ వెల్లడించారు. నోట్ల రద్దు నేపధ్యంలో ఏర్పడిన భారీ డిమాండ్ కు అనుగుణంగా నగదును సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.  ఇప్పటివరకు రూ. 4 లక్షల కోట్ల విలువ చేసే కొత్త నోట్లు సరఫరా చేశామన్నారు. తగినన్ని కొత్త నోట్లు సరఫరా చేస్తామని, ప్రజలు వీటిని దాచుకోవద్దని సూచించారు. పాత పెద్ద నోట్ల రద్దు తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 11.55 లక్షల కోట్ల పాత పెద్ద నోట్లు డిపాజిటయ్యాయని వెల్లడించారు. గత రెండు వారాలు 500, 100 రూపాయల నోట్ల ముద్రణ వేగవంతం చేసినట్టు చెప్పారు. వెయ్యి రూపాయిల నోటును తిరిగి ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నోట్ల రద్దు దేశ హితం కోసం నిర్ణయమని ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. ఆర్బీఐ నోట్ల రద్దు తరువాత తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. ప్రజలు అనవసర భయాలకు గురికావద్దని అన్నారు.