దిల్ షుఖ్ నగర్ పేలుడు కేసులో ఉరి శిక్ష

దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుడు కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో దోషులుగా ఉన్న అసదుల్లా అక్తర్, వకాస్, తహసిన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ లకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. పేలుళ్ళు జరిగిన మూడున్నర ఏళ్లకు ఈ కేసులో దోషులకు శిక్ష పడింది. మొత్తం 157 మంది సాక్షులను విచారించగా 502 డాక్యుమెంట్లను స్థాధీనం చేసుకున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ విచారించింది.

దోషులకు త్వరగా శిక్ష పడడం కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరిపారు. ఈ ఐదుగురు దోషులు హత్య, హత్యాయత్నం, దేశద్రోహం, కుట్ర వంటి అభియోగాలకు సంబంధించి ఐపీసీ 120బీ, 121, 121ఏ, 122, 307, 316, 318, 436, 466, 474, 201 రెడ్‌విత్‌ 34, 109 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోనిసెక్షన్‌ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన వకాస్‌పై విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 14, 2 ఆఫ్‌ 3 కింద నేరం నిరూపణ అయింది. చర్లపల్లి జైలులోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో తుది వాదనల అనంతరం నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 19 మంది మరణించారు. 130 మంది గాయపడ్డారు.